logo

గిరాకీ భళా.. ఉత్పత్తి డీలా..

నిమ్మకాయలు.. వేసవి కాలం పూర్తిగా రాకముందే వినియోగం బాగా పెరిగింది. బహిరంగ మార్కెట్లో వాటి ధర కూడా సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితి.

Updated : 28 Mar 2023 06:03 IST

దడ పుట్టిస్తున్న నిమ్మ ధరలు
సాగు విస్తీర్ణం తగ్గడం వల్లే..
న్యూస్‌టుడే, చల్లపల్లి గ్రామీణం

బొబ్బర్లంకలో సాగవుతున్న నిమ్మ తోట

నిమ్మకాయలు.. వేసవి కాలం పూర్తిగా రాకముందే వినియోగం బాగా పెరిగింది. బహిరంగ మార్కెట్లో వాటి ధర కూడా సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితి. గిరాకీకి తగిన ఉత్పత్తి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొవిడ్‌కు ముందు 500 ఎకరాల్లో నిమ్మ తోటలు ఉండేవని ఉద్యానశాఖ అధికారులు పేర్కొన్నారు. రెండేళ్ల(కొవిడ్‌ సమయం)లో తోటల సాగు భారంగా మారింది. దీంతో రైతులు తోటలను పూర్తిగా తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టారు. దీంతో ప్రస్తుతం 225 ఎకరాల్లో మాత్రమే నిమ్మ సాగవుతోందని అధికారులు తెలిపారు. ఉన్న తోటలకు తెగుళ్లు రావడం, వాటి నివారణకు ఉపయోగించే పురుగు మందుల ధరలు, సాగు ఖర్చులు పెరగడం, విస్తీర్ణం తగ్గడంతో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. వాటిలో నాణ్యమైన కాయలను ఇతర రాష్ట్ర్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కాయలను మూడు గ్రేడ్లుగా వేరు చేసి మొదటి రకం ఇతర రాష్ట్ర్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రెండు, మూడు గ్రేడ్ల కాయలను స్థానిక అవసరాల కోసం మార్కెట్లోకి వస్తున్నాయి. నాణ్యత లేకపోయినా, చిన్నవి అయినప్పటికీ దొరికితే చాలు అన్నట్లు పరిస్థితి నెలకొంది. దీంతో వాటి ధర కళ్లల్లో నీరు తెప్పిస్తోంది. రెండోరకం కాయ ఒకటి రూ.5 నుంచి రూ.7గా, మూడో రకం సైజును బట్టి రూ.4 వరకు విక్రయిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితి ఏమిటని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ధర తారస్థాయికి చేరడంతో శీతల పానియాలు తయారుచేసే వ్యాపారులు నిమ్మ బదులుగా నారింజకాయలు వినియోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని