logo

కట్టేది లేదు.. కష్టపెట్టుడే..

‘‘గన్నవరం విమానాశ్రయంలో రూ.470 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా ఆరంభమైన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనులు అతీగతీ లేకుండా సాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. 2022 చివరికే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలనే నిర్దేశిత గడువు ఎప్పుడో దాటిపోయినా.. జగన్‌ సర్కారు కనీసం కన్నెత్తి చూడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన విమానాశ్రయం అభివృద్ధి సలహా కమిటీ కూడా నాలుగు నెలల కిందట సమావేశమై.. టెర్మినల్‌ పనులపై తీవ్ర అసంతృప్తి తెలిపింది.

Published : 03 Nov 2023 04:34 IST

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను వదిలేసిన జగన్‌ సర్కారు
లక్షలాది విమాన ప్రయాణికులకు అత్యంత కీలకం
ఒక్కొక్కటిగా వెళ్లిపోయిన విమానయాన సంస్థలు

టెర్మినల్‌కు వెళ్లే రహదారి పరిస్థితి ఇదీ..

ఈనాడు - అమరావతి: ‘‘గన్నవరం విమానాశ్రయంలో రూ.470 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా ఆరంభమైన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనులు అతీగతీ లేకుండా సాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. 2022 చివరికే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలనే నిర్దేశిత గడువు ఎప్పుడో దాటిపోయినా.. జగన్‌ సర్కారు కనీసం కన్నెత్తి చూడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన విమానాశ్రయం అభివృద్ధి సలహా కమిటీ కూడా నాలుగు నెలల కిందట సమావేశమై.. టెర్మినల్‌ పనులపై తీవ్ర అసంతృప్తి తెలిపింది. మరో తొమ్మిది నెలల్లో పూర్తిచేయకపోతే ఊరుకోమని.. చెప్పి వెళ్లిపోయింది. కానీ.. ఆ తర్వాత కనీసం విమానాశ్రయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికే వాళ్లు ఇచ్చిన సమయం నాలుగు నెలలు దాటిపోయింది. పరిస్థితి అలాగే ఉంది. రాష్ట్రానికి చెందిన లక్షల మంది విమాన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే ఈ టెర్మినల్‌ విషయంలో ప్రభుత్వం, జిల్లా అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొత్త విమానయాన సంస్థలు రాకపోగా.. గతంలో ఉన్నవి సైతం ఒక్కొక్కటిగా ఇక్కడి నుంచి సర్వీసులను ఆపేసి వెళ్లిపోతున్నాయి.’’

గన్నవరానికి పెరుగుతున్న విమాన ప్రయాణికుల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ కోసం గత చంద్రబాబు ప్రభుత్వం త్వరితగతిన రైతుల నుంచి భూసేకరణ చేపట్టి భారత విమానయాన సంస్థ(ఏఏఐ)కు అప్పగించింది. ఆ తర్వాత టెండర్ల నుంచి ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తూ, ఏఏఐతో మాట్లాడుతూ 2018 డిసెంబరులో అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న సురేష్‌ప్రభుతో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. 2020 ఆగస్టు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తయి.. 2021 జనవరిలో పనులు మొదలయ్యాయి. రెండేళ్లలో అంటే.. 2022 డిసెంబరు నాటికి టెర్మినల్‌ను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలనే లక్ష్యం దాటిపోయి.. ఏడాది కావస్తోంది. ప్రస్తుతం రెండంతస్తుల టెర్మినల్‌ భవనం పనులు శ్లాబు దశకు వచ్చి.. మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. మరో రెండేళ్లయినా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

కనీస పర్యవేక్షణ లేకనే... గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై తెదేపా ప్రభుత్వం అత్యంత ఆసక్తి చూపింది. రూ.160 కోట్లతో దేశీయ టెర్మినల్‌ భవనాన్ని కేవలం ఏడాదిలోనే నిర్మించి.. అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ సర్వీసుల సేవలను గతంలో ఉన్న పాత టెర్మినల్‌ను ఆధునికీకరించి అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ రెండు సేవలూ ఒకే టెర్మినల్‌ నుంచి నిర్వహించేలా.. వచ్చే మూడు దశాబ్దాల అవసరాలకు తగ్గట్టుగా రూ.470 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రకృతి విపత్తులను తట్టుకునేలా స్టీల్‌ అండ్‌ గ్లాస్‌ స్ట్రక్చర్‌తో ఈ భవనం నిర్మించాలనేది ప్రణాళిక. భూసేకరణ సహా అన్ని ప్రక్రియలనూ బాబు ప్రభుత్వం త్వరితగతిన చేపట్టింది. కానీ.. భవన నిర్మాణ ఆరంభ సమయానికి ప్రభుత్వం మారడంతో.. అప్పటి నుంచి పట్టించుకునే వాళ్లు లేక పనులు మందగించాయి.

విమానయాన సంస్థలు రావాలంటే.. భారీ బోయింగ్‌లను నడిపే అంతర్జాతీయ విమానయాన సంస్థలు గన్నవరం నుంచి సేవలు ఆరంభించాలంటే పొడవైన రన్‌వే, అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ ఉండాలి. అందుకే.. రన్‌వే విస్తరణ, టెర్మినల్‌ నిర్మాణాన్ని గత ప్రభుత్వంలో ఆరంభించారు. రన్‌వే విస్తరణ పూర్తయింది. ప్రస్తుతం 11 వేల అడుగులకు పైగా పొడవైన రన్‌వే అందుబాటులో ఉంది. అతిపెద్ద విమాన సర్వీసులు తేలికగా దిగేందుకు, ఎగిరేందుకు వీలుంది. ఇప్పటికే ఎయిరిండియా వన్‌ వంటి విమానాలు గన్నవరంలో దిగి వెళ్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణం మాత్రం జాప్యం జరుగుతోంది.

అంతర్జాతీయ సౌకర్యాలొస్తాయ్‌...

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పూర్తయితే అంతర్జాతీయ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఇదే అతిపెద్ద టెర్మినల్‌్ భవనం అవుతుంది. ప్రయాణికుల సామర్థ్యం గన్నవరానికి పుష్కలంగా ఉంది. ఐదేళ్ల కిందటే ఏటా కనీసం 12 లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. పూర్తిస్థాయిలో అన్ని దేశాలు, నగరాలకు సర్వీసులు అందుబాటులోకి వస్తే.. దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు వస్తారు. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను.. 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. ఒకేసారి 1200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. అధునాతన 24 చెన్‌ఇన్‌కౌంటర్లు, ఆరు ఏరోబ్రిడ్జిలు, 14 ఇమ్మిగ్రేషన్‌ పాయింట్లు, నాలుగు కస్టమ్స్‌ కౌంటర్లు, ఆధునిక కన్వేయర్‌బెల్ట్‌లు, బ్యాగేజీ హ్యాండ్‌లింగ్‌, సెంట్రల్‌ ఏసీ, పటిష్ఠ భద్రతా వ్యవస్థ సమకూరుతుంది.

నత్తనడకన సాగుతున్న నిర్మాణాలు

వందేభారత్‌ సర్వీసుల్లోనే లక్షల మంది..

గన్నవరం విమానాశ్రయంలో కొవిడ్‌కు ముందు వరకు నెలకు లక్ష మంది చొప్పున ప్రయాణించారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా గన్నవరానికి నడిపిన ప్రత్యేక సర్వీసుల్లోనే ఏడాదిలో.. రెండున్నర లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు విదేశాల నుంచి వచ్చారు. విమానాశ్రయం నుంచి కేవలం దేశంలో తొమ్మిది నగరాలకే సర్వీసులు నడిపినా.. భారీగా ప్రయాణికులు పెరిగారు. దేశంలోనే అత్యధిక ప్రయాణికుల వృద్ధి కలిగిన విమానాశ్రయాల జాబితాలో గన్నవరం వరుసగా నాలుగేళ్లు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని నగరాలు, అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమైతే.. భారీగా రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే.. వచ్చే 20 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవన నిర్మాణం ఆరంభించారు. కానీ.. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం ఎలా సాగుతోందనేది పర్యవేక్షించేవాళ్లు కూడా లేకపోవడం బాధాకరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని