logo

AP News: అనంతలో.. ఆ ముగ్గురి పాజిటివ్‌పై ఉత్కంఠ

ఒమిక్రాన్‌.. అనే కొవిడ్‌ వేరియంట్‌ జిల్లా జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లా పొరుగున బెంగళూరులో ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. బెంగళూరు-అనంతకు రాకపోకలు నిత్యకృత్యం. దీంతో ఏ రూపంలోనైనా ఆ మహమ్మారి జిల్లాలోకి ప్రవేశిస్తుందన్న భయం ఆవరించింది.

Updated : 06 Dec 2021 08:54 IST

వేరియంట్‌ గుర్తింపునకు సీసీఎంబీకి నమూనాలు

జిల్లా సచివాలయం(అనంతపురం), న్యూస్‌టుడే: ఒమిక్రాన్‌.. అనే కొవిడ్‌ వేరియంట్‌ అనంతపురం జిల్లా జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లా పొరుగున బెంగళూరులో ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. బెంగళూరు-అనంతకు రాకపోకలు నిత్యకృత్యం. దీంతో ఏ రూపంలోనైనా ఆ మహమ్మారి జిల్లాలోకి ప్రవేశిస్తుందన్న భయం ఆవరించింది. జిల్లావాసులు  ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లి వస్తున్నారు. ఒమిక్రాన్‌ తెరపైకి వచ్చిన నేపథ్యంలో నవంబరు 1 నుంచి ఈనెల 4వ తేదీ దాకా ఎంతమంది విదేశాల నుంచి వచ్చారన్న దానిపై జేసీ డాక్టర్‌ సిరి సారథ్యంలో అనంత బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రత్యేక బృందం నిశితంగా ఆరా తీస్తోంది. ఆయా విమానాశ్రయాల నుంచి జిల్లాకు చేరిన విదేశీ ప్రయాణికుల జాబితాలను తెప్పించారు. నవంబరు 30 దాకా 274 మంది, ఈనెల 1 నుంచి 4వరకు 197 మంది.. మొత్తం 471 మంది జిల్లాకు చేరినట్లు తేలింది. 471 మందిలో తొలి విడతగా 410 మంది చిరునామాలను గుర్తించే పనిలో ఉన్నారు.
252 మందికి పరీక్ష: తొలి విడత 410 మంది జాబితాలో ఇప్పటికే 252 మందిని గుర్తించారు. వీరందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ముగ్గురికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే... ఏ వేరియంట్‌ సోకిందన్న దానిపై గుర్తించేందుకు ప్రత్యేక నమూనాలను హైదరాబాద్‌లో ఉన్న సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)కి పంపించారు. 
కాంటాక్టు నమూనాలపై దృష్టి: 252 మంది నమూనాలను పరీక్షించగా.. తక్కిన 388 మందిలో... అనంత చిరునామా ఇచ్చిన 89 మంది వివరాలు తెలియడం లేదు. నిర్దేశిత చిరునామాల్లో లేరు. మరికొందరు తప్పుడు చిరునామాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి జిల్లాకు చేరిన వారి ప్రథమ, ద్వితీయ కాంటాక్టుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. 582 మందిని ప్రైమరీ కాంటాక్టుగా గుర్తించగా.. వీరిలో 139 మంది నమూనాలు సేకరించారు. మరో 906 మందిని సెకెండరీ కాంటాక్టుగా గుర్తించగా.. వీరిలో 129 మంది నుంచి నమూనాలు తీశారు. వీటిని వ్యాధి నిర్ధారణకు ప్రయోగశాలలకు పంపించారు.
భయపడాల్సిన పని లేదు: సిరి, జేసీ
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఏ వేరియంట్‌ వైరస్‌ ఉందో తెలుసుకోడానికి హైదరాబాద్‌ సీసీఎంబీకి ప్రత్యేక నమూనాలు పంపించాం. ఆ ముగ్గురి ఆరోగ్యం బాగుంది. భయపడాల్సిన అవసరం లేదు. మహమ్మారిని ఎదుర్కోడానికి జిల్లా అధికార యంత్రాంగం అన్నివిధాలా సిద్ధంగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని