logo

ప్రేమ పేరుతో తప్పటడుగులు!

తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. స్కూలుకు ఆటోలో వెళ్లొచ్చేది. ఆటో డ్రైవర్‌ బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.

Updated : 27 Sep 2022 06:23 IST

మైనర్లే అధికం
అదృశ్యం కేసులు నమోదు

తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. స్కూలుకు ఆటోలో వెళ్లొచ్చేది. ఆటో డ్రైవర్‌ బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేయగా, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
అనంత నగరంలో ఇటీవల ఓ జంట అదృశ్యమైంది. వీరిద్దరూ మైనర్లు. అందులోనూ అబ్బాయి కంటే అమ్మాయి రెండేళ్లు పెద్దది. వేర్వేరు కాలనీల్లో నివసిస్తున్నా ఫేస్‌బుక్‌ ద్వారా కలుసుకున్నారు. వివాహం చేసుకోవాలని ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పోలీసులు గాలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రాయదుర్గం నియోజకవర్గంలోని ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. ఆమె ఎనిమిదో తరగతి చదివే సమయంలో కరోనా రావడంతో ఆన్‌లైన్‌ క్లాసులకు ఇంటి నుంచి హాజరయ్యేది. క్లాసుల నెపంతో రహస్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అదే ప్రాంతానికి చెందిన ఇంటర్‌ విద్యార్థితో చాటింగ్‌ చేసేది. ఇలా రెండేళ్లు కొనసాగింది. ఉన్నపళంగా ఇద్దరూ కనిపించకుండా పోయారు.

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ‘తెలిసీ తెలియని వయసు.. ఏది ఒప్పు ఏది తప్పు అనే ఆలోచన లేని అమాయకత్వం.. అవతలి వ్యక్తి ప్రేమగా మాట్లాడితే తన వాళ్లు అనుకునే మనస్తత్వం.. చిన్నవయసులోనే పరస్పరం ఆకర్షణలకు లోనై మంచి భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకుంటున్నారు. ఇటీవల బాలికలు, బాలుర అదృశ్య ఘటనలు అధికమయ్యాయి. ప్రేమ పేరుతో తప్పటడుగులు వేస్తూ.. ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఇందులో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయాలే అధికం.

ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో..
కొవిడ్‌-19 నేపథ్యంలో రెండేళ్ల కిందట పాఠశాలలు మూతపడటంతో ఆయా యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించారు. ఇంట్లోనే క్లాసులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు సైతం పిల్లలకు ఫోన్లు సమకూర్చారు. ఈక్రమంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అలవాటు పడ్డారు. ముక్కుముఖం తెలియని వారితో చాటింగ్‌లు, ఫోన్లలో పరిచయాలు చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఇళ్లు వదిలి పరారయ్యారు. కొందరు పెళ్లి చేసుకున్నారు. ఇటీవల జిల్లాలో మైనర్ల అదృశ్యం కేసుల్లో ఇలాంటివే అధికం ఉండటం గమనార్హం.

వేధింపులకు దారి తీస్తున్నాయ్‌
సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు పెంచుకున్న వారిలో వేధింపులకూ గురవుతున్నారు. కొందరు మోసగాళ్లు నకిలీ ఐడీలతో బాలికలను, యువతులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారు. వారి వ్యక్తిగత చిత్రాలను మార్ఫింగ్‌ చేయడం, బలహీన క్షణాల్లో తీసుకున్న వీడియోలను సోషల్‌ మీడియాల్లో పెడతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతున్నారు. దీంతో పలువురు అమ్మాయిలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. జరిగిన ఘోరం బయటకు చెప్పుకోలేక వేదన అనుభవిస్తున్నారు. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లాలో ఓ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

పర్యవేక్షణ లేకనే..
తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగినవన్నీ సమకూర్చుతున్నారు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయనే ఆలోచన చేయడం లేదు. ప్రధానంగా పిల్లలు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారారు. ఇంట్లో ఎక్కువ సమయం వాటితోనే గడుపుతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులు సైతం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని, వాటికి ప్రేమ అని పేరుపెట్టి చిన్నవయసులోనే తప్పుదారి నడుస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్లలో ఎలాంటివి వీక్షిస్తున్నారు.. ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. తప్పుదారిలో వెళ్లే క్రమంలో దండించాలి. దురదృష్టవశాత్తు ఈమధ్య కాలంలో పర్యవేక్షణ కరవైంది.

కౌన్సెలింగ్‌ అవసరం
ఇటీవల మైనర్లు ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారు. అపరిచిత వ్యక్తులను పెళ్లిళ్లు చేసుకుని లైంగిక దోపిడీకి గురవుతున్నారు. జిల్లాలో మైనర్ల అదృశ్యం కేసుల్లో 90 శాతం ప్రేమ పేరుతో గడప దాటినవే. ఎక్కువగా పదహారేళ్ల వయసులోపు అమ్మాయిలే ఉన్నారు. ఇంట్లో పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. మా వద్దకు వచ్చిన వారికి అపరిచిత సంబంధాలు, ప్రమాదాలపై తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు 303 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. 1128 మందికి సైకో.. సోషియల్‌ కౌన్సెలింగ్‌ సపోర్ట్‌ ఇచ్చాం. వీరిలో 121 మంది తమ తప్పు తెలుసుకుని సామాన్య జీవితం గడుపుతున్నారు.

- శాంతామణి, సఖి సెంటర్‌, అడ్మినిస్ట్రేటర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని