logo

గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు రాష్ట్రపతి అవార్డు

ఇంధనాన్ని పొదుపు చేయడంలో అఖిల భారత స్థాయిలో గుంతకల్లు రైల్వే జంక్షన్‌తో పాటు రైల్వే డివిజనల్‌ ఆసుపత్రి ఎంపికయ్యాయి.

Published : 09 Dec 2022 06:18 IST

గుంతకల్లు, న్యూస్‌టుడే: ఇంధనాన్ని పొదుపు చేయడంలో అఖిల భారత స్థాయిలో గుంతకల్లు రైల్వే జంక్షన్‌తో పాటు రైల్వే డివిజనల్‌ ఆసుపత్రి ఎంపికయ్యాయి. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులు గురువారం డివిజనల్‌ అధికారులకు చెప్పారు. దేశస్థాయిలో గుంతకల్లు రైల్వే జంక్షన్‌ రెండో స్థానాన్ని, రైల్వే డివిజనల్‌ ఆసుపత్రి ఉత్తమ స్థానాన్ని పొందాయి. ఈ అవార్డులను అధికారులు ఇంధన పొదుపు దినోత్సవమైన ఈనెల 14న దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. పది సంవత్సరాల కిందట ఈ రెండు సంస్థలు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతులను అందుకున్నాయి. పది సంవత్సరాల అనంతరం తిరిగి అవార్డులను అందుకోనున్నాయి. 2020-22 సంవత్సరాలకు ఈ రెండు సంస్థలు ఎంపికయ్యాయి. డీఆర్‌ఎం వెంకట రమణారెడ్డి, ఏడీఆర్‌ఎంలు సూర్యనారాయణ, మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీనియర్‌ డీఈఈ గంగరాజు పర్యవేక్షణలో ఇంధనం పొదుపు చర్యలు చేపట్టిన ఫలితంగా పురస్కారాలు వరించాయి. దీనిలో ఏఈ బాబు, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరు హరికృష్ణ పాలుపంచుకున్నారు. సోలార్‌ వాటర్‌ హీటర్లు, సోలార్‌ ప్యానల్స్‌, ఎల్‌ఈడీ లైట్లు, సెన్సార్‌ లైట్లు వినియోగంలోకి తీసుకురావటం ద్వారా విద్యుత్తును పొదుపు చేశారు. రైల్వేస్టేషన్లలో గుంతకల్లు జంక్షన్‌ భారత రైల్వేలో రెండో స్థానం, కార్యాలయాల విభాగంలో రైల్వే ఆసుపత్రి మెరిట్‌ పురస్కారానికి ఎంపికవటం ఆనందంగా ఉందని సీనియర్‌ డీఈఈ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని