logo

దేవరకొండ పైనుంచి దూసుకెళ్లిన కారు

బుక్కరాయసముద్రం శివారులో ఉన్న దేవరకొండ పై నుంచి సోమవారం ఉదయం 11.30 గంటలకు ఓ కారు దాదాపు వంద అడుగుల కిందకు పడిపోవడంతో.. దానిలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల యజమాని దుర్మరణం పాలయ్యారు.

Updated : 18 Apr 2023 08:52 IST

కాలిన గాయాలతో ప్రైవేటు పాఠశాల యజమాని దుర్మరణం
దుర్ఘటనపై పలు అనుమానాలు

ఉమాపతి (పాత చిత్రం)

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: బుక్కరాయసముద్రం శివారులో ఉన్న దేవరకొండ పై నుంచి సోమవారం ఉదయం 11.30 గంటలకు ఓ కారు దాదాపు వంద అడుగుల కిందకు పడిపోవడంతో.. దానిలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల యజమాని దుర్మరణం పాలయ్యారు. అనంతపురం పట్టణం వేణుగోపాల్‌నగర్‌కు చెందిన ఉమాపతి (55) శ్రీవిద్యానికేతన్‌ పేరుతో కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం కారు డ్రైవర్‌ ఉజ్జినప్పతో కలసి కారులో బుక్కరాయసముద్రం శివారులో ఉన్న దేవరకొండపైకి దైవదర్శనం కోసమని వెళ్లారు. దర్శనం చేసుకున్న తర్వాత ఉమాపతి నేను కారులో కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతుంటాననీ.. నువ్వు గుడిలోకి వెళ్లిరావాలని చెప్పారు. డ్రైవర్‌ తిరిగి వచ్చేలోపు కారు ఒక్కసారిగా కింది వైపు కదలడం గమనించాడు. డ్రైవర్‌ సార్‌... సార్‌... అని అరచినా కారు ఆగకుండా రోడ్డు పక్కనే రక్షణ కంచెను దాటి 100 అడుగుల కింద ఉన్న మరో రోడ్డుపై పడిపోయింది. దీంతో ఉమాపతి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌ సమాచారం అందించడంతో పోలీసులు  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై కాలిన గాయాలు ఉండటంతో పోలీసులు కారులో మంటలు ఎలా వ్యాపించాయన్నది పరిశీలిస్తున్నారు. డ్రైవర్‌ను   అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కిందకు దూసుకువెళుతున్న కారు

ప్రమాదమా.. ఆత్మహత్యా?

యజమాని ఉమాపతి కారుతో సహా కాలిన గాయాలతో దేవరకొండపై నుంచి పడి మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారులో కూర్చుని మాట్లాడుతున్న వ్యక్తికి మంటలు ఎలా వ్యాపించాయి, కారు కిందకు ఎలా పడిపోయిందని పోలీసులు విచారిస్తున్నారు. ఇది ప్రమాదమా.. లేదా ఆత్మహత్యా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ జమాల్‌బాషాను వివరణ కోరగా.. డ్రైవర్‌ ఉజ్జినప్ప, మృతుడి కుటుంబ సభ్యులు ప్రమాదం జరగడం వల్లే మరణించాడని ఫిర్యాదు ఇచ్చారన్నారు. దీనిపై సీఐ, డీఎస్పీలతో చర్చిస్తున్నామనీ.. పూర్తిస్థాయి విచారణ తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

ఘటనా స్థలంలో బోల్తా పడిన కారు, పక్కనే మృతదేహం

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని