logo

డబ్బు కోసమే చికెన్‌ వ్యాపారి కిడ్నాప్‌

కొత్తచెరువులో చికెన్‌ సెంటర్‌ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్‌ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్‌ పేర్కొన్నారు.

Published : 29 Mar 2024 04:20 IST

ఎనిమిది మంది నిందితుల అరెస్టు, కారు, చరవాణుల స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వాసుదేవన్‌, సీఐ రాజారమేశ్‌

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువులో చికెన్‌ సెంటర్‌ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్‌ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్‌ పేర్కొన్నారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో గురువారం సీఐ రాజా రమేశ్‌తో కలిసి కిడ్నాప్‌ కేసు వివరాలను వివరించారు. బుక్కపట్నం రోడ్డులో నివసిస్తున్న చలపతి ఈనెల 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు చికెన్‌ దుకాణానికి వెళ్లడానికి ఇంటి బయటకు రాగానే సమీప బంధువైన భానుచంద్ర రెండు కార్లలో వచ్చి కిడ్నాప్‌ చేశారు. సమాచారం అందుకున్న సీఐ వెంటనే స్పందించి పరిసర ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగడంతో భయపడిన కిడ్నాపర్లు చలపతిని ముదిగుబ్బ దగ్గర వదిలేసి హైదరాబాద్‌కు పరారయ్యారు. గురువారం నిందితులు ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం క్రాస్‌ దగ్గర ఉన్నారన్న సమాచారం మేరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మైలాపురం భానుచంద్ర, మొండిగంట్ల శ్రావణ్‌, సూరి, ఇరగంరెడ్డి రుషికేశవరెడ్డి, శివకిశోర్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఇరగంరెడ్డి శివ గంగాధర్‌రెడ్డి, పంగా విఘ్ణవర్ధన్‌, ఒక మైనర్‌ను అరెస్టు చేశారు. ఇంకా ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉంది. ప్రధాన నిందితుడు భాను పెనుకొండలో గాలి బంకు నిర్వహిస్తూ జల్సాలకు అలవాటుపడి అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో స్నేహితులు, బంధువుల సహాయంతో వరుసకు బావ అయ్యే చలపతి కిడ్నాప్‌కు పాల్పడినట్లు డీఎస్పీ వివరించారు. కేసును వెంటనే ఛేదించిన సీఐ, పోలీసులను ఎస్పీ అభినందించారని, వారికి నగదు రివార్డులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని