logo

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్‌ నేడు వెలువడనుంది.

Published : 18 Apr 2024 04:04 IST

25 వరకు గడువు, 29 ఉపసంహరణ

పుట్టపర్తి, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్‌ నేడు వెలువడనుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ), 29 వరకు ఉప సంహరణ చేసుకోవచ్చు. ప్రభుత్వ సెలవు రోజుల్లో మినహా మిగిలిన పని రోజుల్లో నిర్దేశిత గడువు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్‌ అధికారుల (ఆర్వోలు) కార్యాలయాల్లో, లోక్‌సభ నియోజకవర్గానికి  సంబంధించి పుట్టపర్తి కలెక్టరేట్‌లో నామపత్రాలు స్వీకరిస్తారు. నామపత్రాలు అందజేసే సమయంలో అభ్యర్థితోసహా మొత్తం ఐదుగురు మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి అనుమతిస్తారు. అభ్యర్థి గరిష్ఠంగా 4 సెట్లు నామపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంది. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఫాం 7 ద్వారా ప్రకటిస్తారు. అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమంలో పరిగణనలోకి తీసుకుని, బ్యాలెట్‌లో పొందుపరుస్తారు. లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ ఉంటుంది. ప్రచార వ్యయం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.40 లక్షలు, లోక్‌సభ నియోజకవర్గానికి రూ.95 లక్షల పరిమితి విధించారు.

ముహూర్తానికి అనుగుణంగా..

జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులు పేరు బలాలకు అనుగుణంగా 18 నుంచి 25 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నామపత్రాలు దాఖలు సందర్భంగా బలప్రదర్శనకుగాను భారీగా జనాన్ని తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెదేపా, భాజపా, వైకాపా, కాంగ్రెస్‌, ఇతర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని