logo

భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు

విద్యుత్తు శాఖ సెక్షన్‌ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్‌ పరిధిలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి.

Published : 23 Apr 2024 04:40 IST

ఉమ్మడి జిల్లాలో 41 ఏఈ పోస్టులు ఖాళీ
సెక్షన్‌ కార్యాలయాలకు ఇన్‌ఛార్జులుగా డీఈఈలు

అనంతపురంలోని డీ-4 సెక్షన్‌ కార్యాలయం

అనంతపురం (విద్యుత్తు), న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖ సెక్షన్‌ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్‌ పరిధిలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 82 సెక్షన్‌ కార్యాలయాలు ఉండగా 41 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సెక్షన్‌ కార్యాలయాలకు జూనియర్‌ ఇంజినీర్లను ఇన్‌ఛార్జులు (బాధ్యులు)గా నియమించారు. కొన్నిచోట్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (డీఈఈ)లకు సెక్షన్‌ కార్యాలయాలకు బాధ్యులుగా నియమించటంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 12 వేల సర్వీసులను పర్యవేక్షించాల్సిన ఏఈ 35 నుంచి 45 వేల సర్వీసులను పర్యవేక్షిస్తున్నామని ఏఈలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడుంటే.. ఇక్కడుండరు

రెగ్యులర్‌ ఏఈలు లేని సెక్షన్‌ కార్యాలయాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇన్‌ఛార్జులు సక్రమంగా సెక్షన్లకు వెళ్లక ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్‌ఛార్జులు అక్కడుంటే ఇక్కడ ఉండరు అనే పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో గృహ 14 లక్షలు, వాణిజ్య 1.10 లక్షలు, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు 25 వేలు, మున్సిపల్‌ కార్యాలయాలు, పాఠశాలలు, తాగునీటి పథకం 35వేలు, భారీ పరిశ్రమలు 600, వ్యవసాయ 3.50 లక్షలు సర్వీసులున్నాయి. వీటికి సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైనా, నూతన సర్వీసులు పొందాలన్నా వినియోగదారులు, రైతులు, ప్రజలు కచ్చితంగా సెక్షన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది.

పర్యవేక్షణ కష్టం..

  • అనంతపురం జీసస్‌నగర్‌లో ఉన్న డీ-4, బళ్లారి రోడ్డులో ఉన్న డీ-5 సెక్షన్‌ కార్యాలయాలకు ఏఈలు లేకపోవటంతో ఇన్‌ఛార్జులను నియమించారు. డీ-5 సెక్షన్‌ పర్యవేక్షణ బాధ్యతలను డీ-6 సెక్షన్‌ ఏఈకి, డీ-4 సెక్షన్‌ ఏఈ బాధ్యతలను డీఈఈకి అప్పగించారు. మూడు సెక్షన్లను పర్యవేక్షించటంతోపాటు తనకు శాఖాపరంగా ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేసుకుంటూనే డీఈఈ డీ-4 సెక్షన్‌ను చూస్తున్నారు.
  • ముదిగుబ్బ, తలుపుల సెక్షన్‌ కార్యాలయాలను ప్రస్తుతం జేఈ(గ్రేడ్‌-2)కు ఇచ్చారు. సదరు సెక్షన్‌లు రెండు పెద్దవి కావటంతో రెండేళ్ల కిందట వచ్చిన జేఈ వాటిని పర్యవేక్షించలేని పరిస్థితి నెలకొంది. రోజువారీ ఉన్నతాధికారుల ఒత్తిడి ఉండటంతో జేఈ ఆందోళనకు గురవుతున్నారు.
  • నార్పల సెక్షన్‌ కార్యాలయానికి ఇన్‌ఛార్జిగా అనంతపురం వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఈఈని నియమించారు. చిలమత్తూరు సెక్షన్‌ బాధ్యతలను హిందూపురం రూరల్‌ సబ్‌ డివిజన్‌ డీఈఈకి, అనంతపురం డీ-4 సెక్షన్‌ బాధ్యతలను అనంతపురంటౌన్‌-1 సబ్‌డివిజన్‌ డీఈఈకి అప్పగించారు

తప్పని పని భారం..

విద్యుత్తుశాఖ డివిజన్‌, సబ్‌ డివిజన్‌, సెక్షన్‌ కార్యాలయాల్లో జేఈలు పనిచేయాల్సి ఉంటుంది. జేఈలు తమ విధులు నిర్వహిస్తూనే సెక్షన్‌ కార్యాలయాలను పర్యవేక్షించాలని ఇన్‌ఛార్జులుగా నియమించారు. కొందరు ఏఈలు రెండు సెక్షన్లను పర్యవేక్షిస్తున్నారు. రోజువారీ అధికారులు నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్‌లో సెక్షన్ల పురోగతి చెప్పాల్సి ఉంటుందని, అలాగే సమావేశాలకు హాజరవ్వాల్సి ఉందన్నారు.

తెదేపా హయాంలో భర్తీ

తెదేపా ప్రభుత్వ హయాంలో ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 2015, 2017 సంవత్సరాల్లో ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 54 మందిని ఎంపిక చేసి వారికి వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. వైకాపా వచ్చిన తరవాత ఒకసారి కూడా ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. దీంతో ఏఈ పోస్టులు సాధించేందుకు సంసిద్ధమవుతున్న నిరుద్యోగులు జగన్‌ సర్కారుపై మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని