logo

ఇసుకంతైనా భయం లేదు.. దోపిడీ ఆగదు

ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్‌ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ  అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు.

Updated : 24 Apr 2024 06:22 IST

నదులు, వంకలు, వాగులను కొల్లగొట్టిన వైకాపా నాయకులు
అనుమతులు అవసరం లేకుండానే తవ్వకాలు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్‌ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ  అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. కొత్త వ్యక్తులెవరైనా వచ్చి చూస్తే ఇక్కడ నది ఉందా? అన్న సందేహం వచ్చేంతలా ఇసుక దోపిడీ కొనసాగింది. ఐదేళ్లలో ఒక్కో నాయకుడు రూ.వందల కోట్ల విలువైన ఇసుకను బొక్కేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా టిప్పర్లలో సరిహద్దులు దాటించి జేబులు నింపుకొన్నారు. అనుమతులు, నిబంధనలతో పనిలేకుండా కర్ణాటకకు తరలిస్తూ జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. మూడు ప్రధాన నదులు జిల్లాలో ప్రవహిస్తున్నా స్థానికులకు ఇసుక లేకుండా చేశారు.

నాయకుల కనుసన్నల్లోనే..

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను జేబు సంస్థ జేపీ వెంచర్స్‌కు అప్పగించారు. వైకాపాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సబ్‌లీజు తీసుకున్నారు. అనుమతులు తీసుకున్నదాని కంటే కొన్ని వందల రేట్లు ఇసుకను నదుల నుంచి తరలించారు. అనుమతులు రావడానికి నెలరోజుల ముందు నుంచే తవ్వకాలు ప్రారంభించి దోచేశారు. ఒక్కో పర్మిట్‌పై పది టిప్పర్ల ఇసుకను తరలించారు. స్టాక్‌పాయింట్లకు తరలించకుండా రీచుల నుంచే నేరుగా పంపుతుండటంతో ఎంత తవ్వుతున్నారనేదానిపై స్పష్టత లేకుండాపోయింది. రాయదుర్గం పరిధిలో ప్రయివేటు భూముల్లోనూ ఇసుక తవ్వకాలు జరిపి అడ్డంగా దొరికిపోయారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రూ.3 కోట్ల జరిమానా విధించినా..

పెద్దపప్పూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక రేవు పేరుతో వైకాపా నాయకులు పెద్దపప్పూరులోని పెన్నానదిని కొల్లగొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులను సైతం భయభ్రాంతులకు గురిచేసి రూ.కోట్లు విలువచేసే ఇసుకను దోచేశారు. ఏళ్లుగా సాగిన దందాతో పెన్నానది దాదాపు 4 కి.మీ. మేర రూపురేఖలు కోల్పోయింది. నాయకుల దోపిడీ కారణంగా ఏర్పడిన గుంతలు అమాయకులైన ప్రజల ప్రాణాలు బలిగొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో సైతం నది నుంచి ఇసుకను దొంగిలించారు. పెద్దపప్పూరు పెన్నానది రేవులో సాగుతున్న దందాపై ‘ఈనాడు’లో పలుమార్లు కథనాలు ప్రచురితం కాగా భూగర్భ గనులశాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు చేయడానికి వస్తున్నారన్న సమాచారంతో వైకాపా ప్రభుత్వ పెద్దల అండతో అక్రమాలు కప్పిపుచ్చుకొనేందుకు చాగల్లు జలాశయం నుంచి పెన్నానదిలోకి నీళ్లొదిలారు. అధికారుల బృందం తనిఖీలు చేపట్టి అక్రమాలు జరిగినట్లు గుర్తించి ఇసుక రేవు నిర్వాహకులకు రూ.3 కోట్ల జరిమానా సైతం విధించారు. అయినా ఆగకుండా నదిని కొల్లగొట్టారు. పరిశీలించేందుకు వెళ్లిన అధికారులను నాయకులు బెదిరించారు. వైకాపా నాయకుల పాపాల కారణంగా పెన్నానది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో ప్రజలు భవిష్యత్తులో సాగు, తాగు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురించింది.

నిర్మాణాల పేరుతో తోడేస్తున్నారు

బొమ్మనహాళ్‌, కణేకల్లు: బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలా  ల్లోని వేదవతి, పెద్ద, చిన్న హగరి నదుల్లో రోజూ వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనుల ముసుగులో ఐదేళ్లలో బొమ్మనహాళ్‌, కణేకల్లు, డి.హీరేహాళ్‌ మండలాల్లోని అధికార పార్టీ నాయకులు వేదావతి హగరిని తోడేశారు. బళ్లారి, ఉరవకొండ, గుంతకల్లు, తదితర ప్రాంతాల్లో ఇసుకకు డిమాండ్‌ ఉండటంతో పగలు అధికార పార్టీ నాయకులు వారి స్థావరాలకు తరలించి రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం ముసుగులో అనుమతులు రాయించుకుని ఒక్కొక్క ట్రిప్పు ఇసుకను కర్ణాటకలో రూ.8 నుంచి రూ.9 వేలు, గుంతకల్లులో రూ.10 వేలు, ఉరవకొండలో 8 వేలు, యర్రగుంటలో రూ.4,500 చొప్పున అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

వాగులు, వంకలు ఛిద్రం

శింగనమల, బుక్కరాయసముద్రం: వైకాపా నాయకుల ధన దాహానికి వాగులు, వంకలు ఛిద్రమవుతున్నాయి. గార్లదిన్నె, శింగనమల మండలాల్లో ప్రవహిస్తున్న పెన్నా నదిని ఎక్కడపడితే అక్కడ తవ్వేస్తున్నారు. తరిమెల, కల్లుమడి, కొప్పలకొండ తదితర గ్రామాల నుంచి ఇసుక తరలివెళుతోంది. రాత్రిళ్లు జేసీబీలు ఏర్పాటు చేసి ట్రాక్టర్‌ల ద్వారా తెల్లవారే వరకు ఇసుక తోడేస్తున్నారు. నిత్యం 50 ట్రాక్టర్లు జిల్లా కేంద్రం, గార్లదిన్నెకు వెళుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌ రూ.4 వేలతో విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. రోజుకు రూ.2 లక్షలు ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. బుక్కరాయసముద్రం మండలంలోని నీలంపల్లి, చెదుల్ల గ్రామాల్లో వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. ఇక్కడ పట్టపగలే ఇసుక తరలిస్తున్నారు. నిత్యం 120 నుంచి 150 ట్రాక్టర్లు వెళుతున్నాయి.

హద్దేలేని అక్రమ రవాణా

తాడిపత్రి: పట్టణ పరిసరాల్లో ఉన్న పెన్నానదిలో ఇసుకను అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా అక్రమంగా రావాణా చేస్తున్నారు. అధికారుల అండదండలు తోడవడంతో బరితెగించి పట్టపగలే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెన్నానది తాడిపత్రి పురపాలిక, మండలంలో సుమారు 20 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. వీరాపురం, ఆలూరు, సజ్జలదిన్నె, హుస్సేనాపురం, అక్కన్నపల్లి, తాడిపత్రి పురపాలికలోని నందలపాడు, శ్రీనివాసపురం, చిన్నపొలమడ, కోమలి, ఇడుగూరు, చుక్కలూరు గ్రామాల్లో వైకాపా శ్రేణులు వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి లక్షల రూపాయలు గడిస్తున్నారు. రోజూ 30 టిప్పర్లు, 150 ట్రాక్టర్ల ఇసుకను నంద్యాల, బళ్లారి తదితర దూర ప్రాంతాలతోపాటు స్థానికంగా కూడా విక్రయిస్తున్నారు.

ఒక్క ట్రాక్టరునూ అడ్డుకోలేదు..

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు సహజ వనరులను కొల్లగొడుతూ వైకాపా నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తిమ్మలాపురం హగరి నుంచి రోజుకు 100-150 ట్రిప్పుల ఇసుకను వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకున్నారు. ఒక్కొక్క ట్రిప్పు రూ.5000 నుంచి రూ.6000 వరకు ఇసుకను ట్రాక్టర్‌ల ద్వారా వివిధ గ్రామాల విక్రయించి దందా సాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు