logo

చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం

తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌చౌదరి, అనంతపురం అర్బన్‌ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Published : 05 May 2024 03:48 IST

సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌చౌదరి,  ఇన్‌ఛార్జి నాని, నిమ్మలకిష్టప్ప, దగ్గుపాటిప్రసాద్‌, వెంకటశివుడు యాదవ్‌

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌చౌదరి, అనంతపురం అర్బన్‌ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో జోన్‌-5 ఇన్‌ఛార్జి నాని, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌. అనంతపురం పార్లమెంట్‌ ఎన్నికల సమన్వయకర్త నిమ్మలకిష్టప్పలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ.. ఉదయం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 11.00-12.00 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారని, సాయంత్రం 6 గంటలకు సప్తగిరి కూడలిలో బహిరంగ సభకు హాజరవుతారని ఆయన వివరించారు. ప్రజాగళం పేరుతో రెండు, మూడు సభలు నిర్వహించడం జరుగుతుందని, జగన్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.

నాయకుల  వాగ్వాదం

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, అనంతపురం అర్బన్‌ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ అనుచరులు శనివారం ఆయా కార్యాలయాల్లో ఘర్షణ పడ్డారు. ఉదయం దగ్గుపాటి ప్రసాద్‌.. ప్రభాకర్‌చౌదరి నివాసానికి వచ్చారు. తెలుగు యువత నాయకుడొకరు బూత్‌ స్థాయి ఏజెంట్లను ఇష్టానుసారంగా మార్చారన్న కారణంతో ఇరువురి కార్యకర్తలు, నాయకుల మధ్య గొడవ మొదలైంది. తోపులాట చోటుచేసుకుంది. చివరకు కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. కార్యాలయానికి రావాలనే పిలుపుతో ప్రభాకర్‌చౌదరి మధ్యాహ్నం దగ్గుపాటి కార్యాలయానికి వెళ్లారు. మళ్లీ అక్కడ ఇరువర్గాల కార్యకర్తలు, నాయకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి నాయకులను, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని