logo

సమన్వయంతో వైద్యసేవలు

జిల్లాలో అత్యధిక కరోనా కేసులు తిరుపతి నగరంలో నమోదవుతున్నాయి. జిల్లాతో పాటు ఇతర జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందించే రుయా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది 120 మంది కరోనాతో బాధపడుతున్నారు. సిబ్బంది కొరతతో బాధితులకు వైద్యసేవలు అందించడం ఆసుపత్రికి భారంగా

Published : 20 Jan 2022 05:26 IST

 ‘ఈటీవీ-ఈనాడు’తో రుయా సూపరింటెండెంట్‌ భారతి

ఈటీవీ-తిరుపతి: జిల్లాలో అత్యధిక కరోనా కేసులు తిరుపతి నగరంలో నమోదవుతున్నాయి. జిల్లాతో పాటు ఇతర జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందించే రుయా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది 120 మంది కరోనాతో బాధపడుతున్నారు. సిబ్బంది కొరతతో బాధితులకు వైద్యసేవలు అందించడం ఆసుపత్రికి భారంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలను రుయా ఆసుపత్రి సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ భారతి ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో వెల్లడించారు.

ఈటీవీ: జిల్లాలో కీలకమైన రుయా ఆస్పత్రిలో కరోనా వైద్యసేవలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?

భారతి: కరోనా రెండో దశ తగ్గడంతో గతంలో ట్రయేజ్‌, కొవిడ్‌ పరీక్షల కేంద్రాన్ని పాత ప్రసూతి ఆసుపత్రి నుంచి రుయా ఆసుపత్రి ఆవరణలోకి తరలించాం. సంక్రాంతి తర్వాత పరీక్షల కోసం అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో నమూనాల సేకరణ, పరీక్షల కేంద్రం, ట్రయేజ్‌ కేంద్రాన్ని మళ్లీ పాత ప్రసూతి ఆసుపత్రికి మార్చాం.

తిరుపతి నగరంలో ఉద్ధృతికి కారణాలేమంటారు?

3 ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి సందర్శించే వారి సంఖ్య పెరిగింది. రెండో దశ తర్వాత ప్రజల్లో ఉన్న భయం తగ్గి అశ్రద్ధ అధికమైంది. మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది.

గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్‌ పడకల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలేమిటి?

ఆక్సిజన్‌ పడకలు 690, ఐసీయూ పడకలు 135 ఉన్నాయి. ఐసీయూ పడకల్లో 102 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్‌ అవసరమైన బాధితులు 10 నుంచి 12 మంది వరకు ఉన్నారు. వీరి సంఖ్య పెరిగినా సరిపడా అందజేసేందుకు వీలుగా నాలుగు ఆక్సిజన్‌ ట్యాంకులు, నాలుగు పీఏఎస్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు బయో మెడికల్‌ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.

వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ బారిన పడుతున్నారు. వైద్యసేవలపై ప్రభావం పడదంటారా?

రుయాలో వైద్యులు, వైద్యసిబ్బంది, భద్రత సిబ్బంది 120 మంది కరోనా బారినపడటంతో ఎంపిక చేసి శస్త్రచికిత్సలు చేసే విధానానికి విరామం ఇచ్చాం. అందుబాటులో ఉన్న వారిని సమన్వయం చేసుకుంటూ విడతల వారీగా విధులు కేటాయిస్తున్నాం. కరోనా లక్షణాలు తక్కువ ఉన్నవారు ఏడు రోజుల తర్వాత విధులకు హాజరు కావాలని సూచించాం.

మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయి?

ప్రస్తుతానికి ఏవీ లేవు. ఎన్‌ ఆర్‌ బి మాస్కుల మీద ఏడుగురు ఉన్నారు. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడుతూ కరోనా బారిన పడిన వారిని ఆసుపత్రిలో చేర్చుకుంటున్నాం. లక్షణాలు తక్కువ ఉన్న వారిని హోం ఐసోలైషన్‌కు సూచిస్తున్నాం. ఇంట్లో వసతి లేని వారిని విష్ణునివాసానికి పంపుతున్నాం.

పూర్తి స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి?

సంక్రాంతి తర్వాత కరోనా పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తొలుత సాధారణ ఓపీలో పరీక్షలు చేసిన తర్వాత రోగి లక్షణాలు, ఆరోగ్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్యులు కరోనా పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఓపీ టికెట్‌లో స్టాంప్‌ వేసి కరోనా పరీక్షలకు వెళ్లాలని సూచిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని