logo

ఎందుకిలా..!

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మునుపెన్నడూ జరగని రీతిలో భారీగా అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఎందుకిలా జరిగిందంటూ ఉద్యోగులు అంతర్మథనం చెందుతున్నారు. తిరుపతి ఆర్జేసీ పరిధిలోని 6ఏ ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, కసాపురం, మహానంది ఆలయాల్లో పని చేస్తున్న పలువురు

Updated : 02 Jul 2022 07:13 IST

ఆలయ చరిత్రలో ప్రథమం
ఉద్యోగుల అంతర్మథనం
న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మునుపెన్నడూ జరగని రీతిలో భారీగా అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఎందుకిలా జరిగిందంటూ ఉద్యోగులు అంతర్మథనం చెందుతున్నారు. తిరుపతి ఆర్జేసీ పరిధిలోని 6ఏ ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, కసాపురం, మహానంది ఆలయాల్లో పని చేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. వీరిలో శ్రీశైలం ఆలయం నుంచి గరిష్ఠంగా 47 మందిని మిగిలిన ఆలయాలకు బదిలీ చేశారు. రెండో స్థానంలో శ్రీకాళహస్తి నుంచి 24 మంది, కాణిపాకం నుంచి ముగ్గురు, కసాపురం, మహానంది నుంచి నలుగురు వంతున ఉద్యోగులను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీకాళహస్తీశ్వరాలయ చరిత్రలో ఇంత భారీగా బదిలీలు చేయడం ఇదే ప్రథమం. 2006లో బదిలీలు చేసినా ప్రధానంగా ఏఈవో, సూపరింటెండెట్‌, సీనియర్‌ అసిస్టెంట్లను పన్నెండు మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం జూనియర్‌ అసిస్టెంట్లను సైతం బదిలీలు చేస్తూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బదిలీల్లో 24 మంది బదిలీలు కాగా 19 మంది ఇక్కడకు బదిలీపై వస్తున్నారు.

‘సిఫార్సు’లపై ఆశలు: అయిదేళ్లకు పైబడిన వాళ్లందరికీ బదిలీ గండం ఉంటుందని తెలిసినప్పటికి ఇక్కడి అధికారులు, ఉద్యోగులు తమదైన రీతిలో సిఫార్సు లేఖలు సిద్ధం చేసుకున్నారు. ఎలాగైనా బదిలీలు కాకుండా ఆగేందుకు తమదైన రీతిలో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ బదిలీల గండాన్ని తప్పించుకోలేక పోయారు. ప్రస్తుతం పలువురు అధికారులు, ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అక్రమాలతోనే అనర్థమా 

ఇటీవల కాలంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో అవినీతి, ఆక్రమాల పరంపర యధేచ్ఛగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని దర్శనార్థం వచ్చిన శ్రీశారదా పీఠాధిపతి శ్రీస్వరూపానంద సరస్వతి స్వయాన చెప్పడం, అంతేకాకుండా ప్రమాణ స్వీకారం చేయకుండా ముక్కంటి దర్శనార్థం వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణకు భక్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు.. ఇక్కడ దర్శనార్థం వచ్చిన పలువురు వీఐపీలు జరుగుతున్న అవినీతి, అక్రమాలకు సంబంధించి దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం తదితర కారణాలతో భారీగా అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారన్నది స్పష్టమవుతోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడిన పలువురు ఉద్యోగులు, అర్చకులపై సస్పెన్షన్‌ వేట్లు కొనసాగుతూనే ఉన్నాయి. బదిలీ వచ్చినా నిలుపుదల చేసుకోవచ్చన్న ఆత్మవిశ్వాసంతో ఉంటూ వచ్చిన అధికారులు, ఉద్యోగులు బదిలీ దృష్ట్యా అంతర్మథనం చెందుతుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని