logo

విద్యుత్తు రాయితీ హుళక్కేనా!

విద్యుత్తు బిల్లులు ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నాయి. రాయితీలు అందని వారు తీవ్రంగా నష్టపోతున్నారు. తెదేపా హయాంలో విద్యుత్తు బిల్లులు తక్కువగా ఉండేవి.

Published : 27 Nov 2022 04:21 IST

నిబంధనల మాటున కొర్రీలు 
ఆక్వా రైతుల అవస్థలు వర్ణనాతీతం

ఆక్వా సాగులో విద్యుత్తు మోటార్‌

విద్యుత్తు బిల్లులు ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నాయి. రాయితీలు అందని వారు తీవ్రంగా నష్టపోతున్నారు. తెదేపా హయాంలో విద్యుత్తు బిల్లులు తక్కువగా ఉండేవి. వైకాపా అధికారంలోకి వచ్చాక యూనిట్‌ ధరలు పెంచి రాయితీ ప్రకటించింది. పదెకరాల రైతులకు రాయితీతో విద్యుత్తు సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కావడం లేదు. సన్న,  చిన్న కారు రైతులు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి రావడం పెద్ద సమస్యగా మారుతోంది. పత్రాలు ఇవ్వని వారి రాయితీ  ఆపేశారు. దీంతో కర్షకులు పెరిగిన ధరల మేరకు చెల్లించాల్సి వస్తోంది.

గూడూరు, న్యూస్‌టుడే: గూడూరు డివిజన్‌ తీర ప్రాంత మండలాల్లో అధికారికంగా 6,696.14 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నారు. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎక్కువగా ఉంది. విద్యుత్తు రాయితీ కోసం పదెకరాల ఆక్వా సాగు చేసే రైతులు ముందస్తుగానే చెరువు లీజు ఒప్పందం చేసుకోవాలి. లైసెన్స్‌, విద్యుత్తు మీటరు, భూమి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. 10 హార్స్‌పవర్‌ వినియోగించే వారికే రాయితీపై యూనిట్‌ రూ.1.50 వర్తిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి నిబంధనలు వెరసి రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. ఇదిలా ఉంటే సాగు చేసే రైతులు యజమానుల నుంచి లీజుపత్రాలు తీసుకోవడం గగనమవుతోంది. ఇక ఎంపెడా ధ్రువీకరణ తదితర పత్రాలు ఇవ్వని రైతులు యూనిట్‌కు రూ.4 చెల్లించాల్సి వస్తోంది. ఇలా రాయితీ లేని రైతులు పదెకరాల సాగు కోసం నెలకు సరాసరి రూ.40 వేల విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. అదే రాయితీ వర్తిస్తే రూ.15 వేలతో సరిపెట్టుకోవచ్చు. సాగు కోసం ఎంపెడా అనుమతి.. వివిధ రకాల ప్రభుత్వ ధ్రువీకరణలు తప్పనిసరి చేయడంతో సగానికి పైగా వదిలేశారు.


దరఖాస్తు చేసుకుంటే వర్తింపజేస్తాం
- చాంద్‌బాషా, జిల్లా మత్స్యశాఖ అధికారి

ఆక్వా సాగు చేసే రైతులు వివరాలు ఎక్కడికక్కడ ఆర్‌బీకేల్లో పెట్టాం. వారు ధ్రువీకరణ పత్రాలు అందజేసి రాయితీ విద్యుత్తుకు దరఖాస్తు చేసుకోవాలి. లేకుంటే వర్తించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని