logo

అంతా రహస్యమే..!

ప్రతినెలా విధిగా కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించాలి.. జమాఖర్చులు తెలియజేయాలి.. అజెండాలోని అంశాలను ఉన్నతాధికారులకు పంపాలి.. అందరికీ తెలిసేలా నోటీసు బోర్డులోనూ కనబరచాలి.

Updated : 02 Dec 2022 07:24 IST

వెలుగులోకి రాని అజెండా అంశాలు
తూతూమంత్రంగా పురపాలిక సమావేశాలు

సూళ్లూరుపేటలో పుర కౌన్సిల్‌ సమావేశం

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ప్రతినెలా విధిగా కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించాలి.. జమాఖర్చులు తెలియజేయాలి.. అజెండాలోని అంశాలను ఉన్నతాధికారులకు పంపాలి.. అందరికీ తెలిసేలా నోటీసు బోర్డులోనూ కనబరచాలి. ఇందుకు భిన్నంగా పలు పురపాలికల్లో అంతా రహస్యంగా ఉంచేస్తున్నారు.

కౌన్సిల్‌ సమావేశాల్లో ఆర్థిక అంశాలతోపాటు, అభివృద్ధి పనుల గురించి చర్చించాలి. జమాఖర్చులు, అభివృద్ధి అంశాల గురించి పూర్తిస్థాయిలో సమావేశంలో తెలియజేసి, ఆమోదం పొందాలి. దీనినే సమావేశ అజెండాగా పిలుస్తుంటారు. ఇందులో ఉండే అంశాలను ఒక్కొక్కటిగా చదివి వినిపించిన తర్వాత కౌన్సిలర్ల ఆమోదం పొందాలి. ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని పురపాలక ఛైర్మన్‌ మినిట్స్‌ బుక్‌లో నమోదు చేస్తూ.. ప్రతిదాని కింద వెంటనే సంతకాలు చేయాలి. కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తర్వాత అదేరోజు సాయంత్రం అజెండాలోని అంశాలతోపాటు, కౌన్సిల్‌ తీర్మానం చేసిన వాటిని తెలియజేస్తూ.. సంబంధిత నకలును గుంటూరులోని పురపాలక కమిషనర్‌ (సీడీఎంఏ), కలెక్టర్‌, ఆర్డీవో/సబ్‌కలెక్టర్‌కు పంపాలి. సంబంధిత కార్యాలయ నోటీసు బోర్డులో కనబరచాలి.

నిధులు పక్కదారి ఇలా..

పురపాలిక కౌన్సిల్‌ సమావేశాల్లో జమాఖర్చుల గురించి చర్చించకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. పలువురు ఉద్యోగులు వాటిని తమ సొంత జేబుల్లో వేసుకున్న దాఖలాలు లేకపోలేదు. గతంలో గూడూరు పురపాలక సంఘంలో రూ.18 లక్షలు ఎలాంటి బిల్లులు లేకుండా పక్కదారి పట్టింది. ఆ తర్వాత నిధులను ఉద్యోగులే దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. సూళ్లూరుపేట పురపాలికలో రూ.32.50 లక్షలు ఇతరులు తమ సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. సంబంధిత కార్యాలయంలోని ఓ ఉద్యోగి జమాఖర్చులు పరిశీలిస్తుండగా నిధులకు లెక్కలే లేవు.  సిబ్బందే జేబులో వేసుకున్నట్లు తెలిసింది. విషయం సీడీఎంఏకు తెలియడంతో వారి విచారణ చేపట్టారు.

ఉన్నతాధికారులకు తెలియజేయాలి

కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చించిన, ఆమోదించిన అంశాలను ఉన్నతాధికారులకు తెలియాజేయాలి. జమాఖర్చులు వెల్లడించాలి.అజెండా ప్రతులను ఉన్నతాధికారులకు పంపేలా చర్యలు తీసుకుంటాం.

మూర్తి, ఆర్డీ, అనంతపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని