logo

గడువు లేక.. దరఖాస్తు వీలుకాక

చేదోడు పథకం అర్హులందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. దరఖాస్తుకు మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు చాలినంత సమయం లేకపోవడంతో పలువురు కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేక పోయారు.

Published : 30 Jan 2023 03:15 IST

ఈ దఫా అందరికీ అందని చేదోడు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), తిరుపతి (కలెక్టరేట్‌) న్యూస్‌టుడే: చేదోడు పథకం అర్హులందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. దరఖాస్తుకు మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు చాలినంత సమయం లేకపోవడంతో పలువురు కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేక పోయారు. ఈ మేరకు వారు ఆందోళన చెందుతున్నారు. అవసరమైన పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నా సకాలంలో అందక పోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.

సమయం లేక..

పథకం కింద దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో రెండో విడత సాయం అందించగా, ఈనెల 30వ తేదీ మూడో విడతగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా అర్హత సాధించిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా, సమయం లేకపోవడంతో పథకానికి దూరమయ్యారు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా ఉద్దేశ పూర్వకంగానే మూడు రోజులు మాత్రమే గడువిచ్చారని ఆరోపిస్తున్నారు. పాత లబ్ధిదారుల నుంచి వేలి ముద్రల సేకరణ కూడా ఇదే సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజుల్లోనే పలు రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ప్రకటించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, పాత వారు సైతం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. చివరి రోజైన 26న గణతంత్ర దినోత్సవం కావడంతో సచివాలయాలు, తహసీల్దారు కార్యాలయాలు పనిచేయలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొరాయించిన సర్వర్‌..

లబ్ధిదారులు కార్మిక ధ్రువీకరణ పత్రాన్ని (లేబర్‌ సర్టిఫికెట్‌) తాజాగా తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఈపత్రాన్ని రెండు గంటల్లోనే జారీ చేస్తున్నారు. కుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం, రేషన్‌, ఆధార్‌ కార్డులు, ఫొటోను ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల్లోనే ఈనెల 26వ తేదీ సాయంత్రం లోపు అప్‌లోడ్‌ చేసి అనుసంధానం చేయాలి. అయితే సర్వర్‌ మోరాయించడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగించారు. సచివాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి ఏపీ సేవ పోర్టల్‌ వినియోగిస్తారు. అక్కడే తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జారీ చేస్తారు. శుక్రవారం ఉదయం నుంచే పోర్టల్‌ సర్వర్‌ మొరాయించింది. దీంతో చేదోడు దరఖాస్తుదారులకు కార్యాలయాల వద్దనే సాయంత్రం వరకూ పడిగాపులు తప్పలేదు. ఈ పరిస్థితుల్లో పత్రాలు సమర్పించేందుకు గడువు పెంచాలని కోరుతున్నారు.


మరో అవకాశం ఉంటుంది..

సుబ్రహ్మణ్యం, ఈడీ, బీసీ కార్పొరేషన్‌

ఇబ్బంది పడిన వారికి మరో అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. ఈనెల 30న మూడో విడత పంపిణీ అనంతరం మరో సారి నమోదుకు అవకాశం కల్పిస్తారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని