logo

జలభద్రం

ఎండలు మండిపోతున్నాయి.. భూగర్భజలాల మట్టం తగ్గి నగరంలో పలుచోట్ల బోర్లలో నీటి మట్టం పడిపోతోంది.

Updated : 24 Mar 2023 03:41 IST

నీటి పొదుపు, సంరక్షణ తప్పనిసరి

దర్గా కూడలిలో నగరపాలక నీటి శుద్ధీకరణ కేంద్రం వద్ద నిర్మించిన ఇంకుడుగుంత(పాత చిత్రం)

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం: ఎండలు మండిపోతున్నాయి.. భూగర్భజలాల మట్టం తగ్గి నగరంలో పలుచోట్ల బోర్లలో నీటి మట్టం పడిపోతోంది.. శాశ్వత నీటి పథకాలు లేని జిల్లా కేంద్రానికి ఎన్టీఆర్‌ జలాశయమే దిక్కు.. వరదలతో నిండే ఈ జలాశయం నుంచి ఆర్నెల్లకు వరకు నగరానికి నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి.. ఇక ఈ ప్రాజెక్టులో నీరు ఖాళీ అయితే బిందెడు నీటికి నగర ప్రజలు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి మొదలవుతుంది.

ప్రతి ఇంట్లోనూ ఇంకుడుగుంత..

నివాస ప్రాంగణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని అందరూ మరిచారు. పాత కాలంలో ఉపయోగించే ఈ పద్ధతిలో భూమిలో నీరు ఎల్లప్పుడూ ఉండేది. నగరంలో 40వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక ఇంకుడుగుంత నిర్మిస్తే భవిష్యత్తులో నీటి సమస్య ఏర్పడదు. అతి తక్కువ ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు రూ.7వేల నుంచి రూ.8వేలు వెచ్చించాలి. తొలుత ఇంట్లో బోరు పక్కన మూడు అడుగుల గుంత తీయాలి. ఈ గుంతలో పట్టేలా సిమెంటుతో రింగులుగా తయారు చేసుకోవాలి. వాటిని ఈ గుంతలో దించాలి. రింగు రింగుకు మధ్య కాంక్రీటు, సిమెంటు మాత్రమే వినియోగించాలి. అనంతరం అలాగే విడిచిపెట్టి దీనిపై ఒక కప్పు పెట్టుకోవాలి. ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని ప్రత్యేక పైపు ద్వారా ఈ గుంతలోకి మళ్లించేలా ఏర్పాటు చేసుకోవాలి.

శుద్ధీకరణ కేంద్రాల వద్ద..

నగరంలో వివిధ ప్రాంతాల్లో నగరపాలక, ప్రైవేటు శుద్ధీకరణ కేంద్రాలు(మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌) వెలిశాయి. వీటి నుంచి నిత్యం లక్షల లీటర్ల నీరు వృథాగా మురుగునీటి కాలువల్లో విడిచిపెడుతు న్నారు. ప్రతి కేంద్రం వద్ద ఇంకుడుగుంతలు నిర్మిస్తే ఆ నీరు భవిష్యత్తులో ఉపయోగించుకునే వీలుం టుంది. ఆయా కేంద్రాల నిర్వాహకులు ఆలోచించి వృథానీరు వెళ్లే స్థలంలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకుంటే భావితరాలకు నీరు అందించిన వారమవుతాం.

లీకేజీలు గుర్తించి సమాచారం..

నగరంలో 80 కిమీ వరకు పైప్‌లైన్ల ద్వారా నివాసాలు, పబ్లిక్‌ కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పాత పైప్‌లైన్లు విరిగి, తుప్పుపట్టి వాల్వ్‌ల వద్ద నీరు లీకవుతోంది. గంటల తరబడి ఇలా నీరు వృథాగా రోడ్లపై పోతోంది. దీన్ని స్థానికులు తమ కాలనీల్లో గుర్తించి నగరపాలక అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.

అవగాహన ముఖ్యం..

ఇళ్లల్లో నీటి వినియోగంపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి.  తొలుత మార్పు మన నుంచే మొదలైతే సమాజంలోనూ నీటి పొదుపుపై అవగాహన వస్తుంది. నీటి వనరులు ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి.

వెంకట ప్రసాద్‌, డీఈఈ, నగరపాలక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని