logo

చిన్నవాటిలో చేతివాటం.. పెద్దవాటిలో రాజకీయజోక్యం

పట్టణాల్లో ట్రేడ్‌ లైసెన్సుల మాయాజాలం జరుగుతోంది. ఏటికేడు దుకాణాలు పెరుగుతున్నా వసూళ్లలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కొన్నిచోట్ల నిర్ణీత ధరల కంటే తక్కువగా వసూలు చేస్తున్నారు.

Published : 30 Mar 2023 02:22 IST

ట్రేడ్‌ లైసెన్సు ఫీజుల్లో మాయాజాలం
పెరిగిపోయిన అనధికారిక వసూళ్లు

గూడూరు, న్యూస్‌టుడే: పట్టణాల్లో ట్రేడ్‌ లైసెన్సుల మాయాజాలం జరుగుతోంది. ఏటికేడు దుకాణాలు పెరుగుతున్నా వసూళ్లలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కొన్నిచోట్ల నిర్ణీత ధరల కంటే తక్కువగా వసూలు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల చిన్నాచితకా దుకాణాలతో బేరాలు సాగిస్తుండగా పెద్దఎత్తున వసూలు చేయాల్సిచోట రాజకీయ జోక్యం పెరుగుతోంది. దీంతో పురపాలక ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది.ఉమ్మడి జిల్లాలో ఏటా రూ.2.25 కోట్ల మేర ట్రేడ్‌ లైసెన్స్‌ వసూలవుతోంది. చిత్తూరు నగరంలో బార్‌, రెస్టారెంట్స్‌ వంటి వాటి నుంచి ఏటా రూ.17,300 వసూలు చేయాల్సి ఉంది. ఫ్రూట్‌ జ్యూస్‌ తయారీ పరిశ్రమల నుంచి రూ.7 వేలు, లాడ్జీలకు రూ.4 వేలు లెక్కన ఆయా కేటగిరీలవారిగా పురపాలక సంఘాలు ధరలు నిర్ణయించి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈక్రమంలో ఎక్కడికక్కడ చేతివాటం ప్రదర్శిస్తుండటంలో ఆదాయానికి గండిపడుతోంది. కొన్ని దుకాణాలు లెక్కలోకి తీసుకోకుండా ఆప్రాంత అధికారులు కొందరు పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిఘా, పారదర్శక వ్యవస్థ లేకపోవడంతో ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ముందస్తు ఏడాది లెక్కలేసి అంతకు 1-5 శాతం పెంచి సర్దుబాటు చేస్తున్నారు. ఈతంతు నగర సంస్థలతోపాటు పురపాలికల్లో ఎక్కువగా నడుస్తోంది.

ఆహార పదార్థాల తయారీ సంస్థలు, ఫైనాన్స్‌, ఫైర్‌వర్క్స్‌, మెడికల్‌, బ్యాంకులు, టీ, టైల్స్‌ దుకాణాలు, ఎగ్జిబిషన్లు, పండ్ల దుకాణాలు, లాడ్జీలు తదితర వాటి నుంచి లైసెన్సు ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. ఏటా దుకాణదారులే ముందకువచ్చి రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంది. తిరుపతి నగరంలో ఆసుపత్రులు వంటి వాటి నుంచి రూ.6 వేల వరకు వసూలు చేయాల్సి ఉంది. ఇక్కడ పెద్దఎత్తున దుకాణాలున్నా ఫీజులు నామమాత్రంగానే ఉంటున్నాయి. చిత్తూరు నగరంలో నాలుగేళ్లలో దుకాణాల సంఖ్య విస్తరించినా ఆమేరకు ఫీజులు వసూలు చేయడంలేదు. పాలకవర్గాలు కొలువుదీరినా పట్టింపు లేదు. గూడూరు పట్టణంలో దుకాణాల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ ఏటా రూ.14 లక్షలకు మించడంలేదు. ఇక్కడ ఆక్వా ఫీడ్‌ దుకాణాలు, ఐస్‌ ఫ్యాక్టరీలు వంటివిఉన్నా వాటి జోలికి వెళ్లడంలేదు. ఇక్కడ పనిచేస్తున్న కొం దరు తాత్కాలిక ఉద్యోగులు కొన్ని దుకాణాల నుంచి వసూలు చేస్తున్న ఫీజులకు రసీదులు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

పారదర్శకంగా వసూలయ్యేలా చర్యలు

పట్టణ స్థానిక సంస్థల్లో కొత్తగా వెలసిన దుకాణాలపై సర్వే చేయించి ఫీజులు వసూలు చేస్తున్నాం. మరింత లోతుగా గణన పూర్తిచేసి అందరి నుంచి వసూలయ్యే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుకాణదారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి రసీదులు తీసుకోవడం ఉత్తమం. - మూర్తి, ఆర్డీ, పురలపాలక శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని