logo

అడవి పందుల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

వేటకు వెళ్లిన సహచరుడు ఆకస్మికంగా విద్యుదాఘాతానికి గురై మరణించడంతో.. అతడి శవాన్ని మాయం చేసేందుకు మిగిలిన ఆరుగురు ప్రయత్నించి చివరకు పోలీసు కేసులో చిక్కుకున్న ఘటన చిత్తూరు జిల్లా ఐరాల

Published : 31 Mar 2023 02:33 IST

మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించిన ఆరుగురిపై కేసు

ఐరాల, న్యూస్‌టుడే: వేటకు వెళ్లిన సహచరుడు ఆకస్మికంగా విద్యుదాఘాతానికి గురై మరణించడంతో.. అతడి శవాన్ని మాయం చేసేందుకు మిగిలిన ఆరుగురు ప్రయత్నించి చివరకు పోలీసు కేసులో చిక్కుకున్న ఘటన చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి కల్లూరు సీఐ ఆశీర్వాదం, ఐరాల ఎస్సై వెంకటేశ్వర్లు కథనం మేరకు.. ఐరాల మండలంలోని 35-యర్లంపల్లె పంచాయతీ బెస్తపల్లెకు చెందిన జి.సుబ్రహ్మణ్యం(51), అదే గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు, నందయ్య, నాగంవాండ్లపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన ఎ.రెడ్డెప్ప, పి.సుబ్రహ్మణ్యం, ఎం.చిన్నబ్బ, బీ.వీరభద్ర కలిసి.. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో అడవి పందుల వేటకు వెళ్లారు. అందరూ కలిసి విద్యుత్తు తీగలు ఏర్పాటుచేసి దూరంలో వేచిఉండగా అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో అడవి పంది చిక్కుకుందే మోనని చూసేందుకు సుబ్రహ్మణ్యం వెళ్లి పొరపాటున విద్యుత్తు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. విషయం గ్రామంలో తెలిస్తే సమస్య అవుతుందని మిగిలిన ఆరుగురు.. తమ సహచరుడి శవాన్ని అక్కడి నుంచి రెండు కిమీ దూరంలో ఉన్న తోకబండ వైపు తీసుకెళ్లి అక్కడ బండల మధ్య పడేసి ఘటనాస్థలి వద్ద ఆధారాలు తొలగించి వారి గ్రామాలకు వెళ్లిపోయారు. రెండ్రోజుల క్రితం వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో సుబ్రహ్మణ్యం కుటుంబీకులు గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో వెతికారు. బండల మధ్య దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూడగా అతడు విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు వెంకటేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని