logo

ఎండ కాసినా.. గాలి వీచినా పల్లెల్లో విద్యుత్తు కోత

ఎండలు అధికంగా కాసినా.. గాలులు బలంగా వీచినా.. పల్లెల్లో అంధకారం అలుముకుంటోంది. అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 31 May 2023 05:17 IST

అల్లాడుతున్న ప్రజలు

నాయుడుపేట బజారువీధిలో చీకట్లో ట్రాఫిక్‌ తిప్పలు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: ఎండలు అధికంగా కాసినా.. గాలులు బలంగా వీచినా.. పల్లెల్లో అంధకారం అలుముకుంటోంది. అప్రకటిత విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదారు రోజులుగా అక్కడక్కడ పడుతున్న వర్షాలకు వాతావరణం చల్లబడింది. విద్యుత్తు వినియోగం కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎండ నుంచి కొంత ఉపశమనం లభించడం, విద్యుత్తు వినియోగం తక్కువగా ఉండటంతో కోతలు ఉండవని ప్రజలు భావించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి పలు మండలాల్లో విడతల వారీగా విద్యుత్తు కోతలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళలో దాదాపు రెండు గంటలు, పట్టణ ప్రాంతాల్లో ఏదో ఒక సమయంలో గంటకు పైగా, తిరుపతి నగరంలో పలు ప్రాంతాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు సరఫరా నిలిపివేశారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం అధికారికంగా కోతలు లేకపోయినా అనధికారికంగా అమలు చేస్తున్నారు.

* తిరుచానూరులో నాలుగు రోజుల నుంచి  రోజూ పలు దఫాలుగా విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. తిరుపతి గ్రామీణ మండలం పాడిపేట, గంగనగుంట గ్రామాల్లో విద్యుత్తు సరఫరా గంటల తరబడి రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గాలి, వర్షాల కారణంగా విద్యుత్తు తీగల మరమ్మతుల కోసమే సరఫరా నిలిపి వేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వర్షాలు లేని సమయంలోనూ సరఫరా నిలిపివేయడం గమనార్హం.

తిరుపతి డివిజన్‌ పరిధిలో...

తిరుపతి గ్రామీణ డివిజన్‌ పరిధిలోని 187 ఫీడర్లలో 119 వ్యవసాయ ఫీడర్లు ఉన్నాయి. రోజూ డివిజన్‌ పరిధిలో 3.5 మిలియన్‌ యూనిట్లు వినియోగం ఉండగా.. ప్రస్తుతం అది 4.2 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ఒక్కసారిగా వినియోగం పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయి. ఈ క్రమంలో  గ్రామీణ ప్రాంతాల పరిధిలో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు.  
నగరంలోనూ.. తిరుపతి నగరం ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో విద్యుత్తుకు అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం నగరంలో ఏదో ఒక ప్రాంతంలో దాదాపు గంటకు పైగా సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు అనధికార కోతలు అమలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.


నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే:  నాయుడుపేట పట్టణంలో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి కరెంటు లేకపోవడంతో ప్రజలు చీకట్లో కాలం గడిపారు. రోజులో ఏదొఒక సమయంలో అనధికారిక కోతలతో తిప్పలు పడుతున్నారు. సబ్‌స్టేషన్‌లో మరమ్మతులతో తరచూ తలెత్తడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. పట్టణంలో కరెంటు లేకపోవడంతో ఉక్కపోత, దోమల మోతతో ప్రజలు నిద్రలేని రాత్రిళ్లు గడుపుతున్నారు.


తూర్పున చిమ్మచీకట్లు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గూడూరు నియోజకవర్గంలో  గాలి వీస్తే కరెంట్‌ కోత తప్పడం లేదు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోయారు. అనూహ్యంగా వాతావరణంలో మార్పుతో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల ప్రభావానికి ఒక్కసారిగా కరెంట్‌ పోయింది. గూడూరు పట్టణ, గ్రామీణ, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకు సరఫరా నిలిపివేసి సాయంత్రం ఆరు గంటలకు పునరుద్ధరించారు. గంట తరువాత పలుచోట్ల విద్యుత్తు మళ్లీ నిలిచిపోయింది. కొన్ని పల్లెల్లో కోత ఏర్పడంతో ప్రజలు చిమ్మచీకట్లో కాలం గడిపారు. ఈదురు గాలుల ప్రభావంతో తీర ప్రాంతం చిల్లకూరు మండలంలోని సుమారు 30 పంచాయతీల్లో రాత్రి 8 గంటలకు విద్యుత్తు సరఫరా నిలిచింది. వాకాడు మండలంలోని 19 పంచాయతీల్లో సుమారు ఆరు గంటల పాటు విద్యుత్తు లేదు. దీంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని