logo

అంతా మా ఇష్టం..

జిల్లాలో విద్యుత్తు కోతలు అధికమయ్యాయి.. వేళాపాళా లేకుండా ఇష్టానుసారం కోతలు విధిస్తుండడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు.. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు.

Published : 31 May 2023 04:20 IST

విద్యుత్తు కోతల్లో నూతన పంథా
ఎడాపెడా నిలిపివేత
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

చిమ్మచీకటిలో పుత్తూరు మండలంలోని తడుకు గ్రామం

చిత్తూరు(మిట్టూరు), పుత్తూరు, న్యూస్‌టుడే:  జిల్లాలో విద్యుత్తు కోతలు అధికమయ్యాయి.. వేళాపాళా లేకుండా ఇష్టానుసారం కోతలు విధిస్తుండడంతో వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు.. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు.. తాజాగా రెండ్రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి కొంత ఉపశమనం లభించినా రాత్రివేళ తీవ్ర ఉక్కపోత తప్పడం లేదు.. వరుణుడు కరుణించినా కోతల నుంచి విముక్తి లభించడం లేదు.. ఇష్టానుసారంగా గ్రామీణ, మండల కేంద్రాల్లో ఎక్కువ సమయం, పట్టణ, నగర ప్రాంతాల్లో తక్కువసేపు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు.

గ్రామాల్లో ఇష్టానుసారంగా..

గ్రామీణ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా సరఫరా నిలిపేస్తున్నారు. చిత్తూరు గ్రామీణం, గుడిపాల, పాలసముద్రం, పలమనేరు, పూతలపట్టు, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, పెనుమూరు, బైరెడ్డిపల్లె, గంగవరం, రామకుప్పం ప్రాంతాల్లో అప్రకటిత కోతలు అధికమయ్యాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేక.. లోటు సర్దుబాటుకు గ్రామీణ, మండల ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా కోత విధించక తప్పడం లేదు. రాత్రి అనూహ్యంగా డిమాండ్‌ పెరిగినప్పుడు దాన్ని నియంత్రించలేక అర గంట నుంచి గంట పాటు నిలిపేస్తున్నా. అధికారులను ప్రశ్నిస్తే లోవోల్టేజీ, వర్షం తదితర సాంకేతిక కారణాలు సాకుగా చూపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లోడ్‌కు అనుగుణంగా అందించాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు లేక ఉన్నవి దెబ్బతింటున్నాయి. కొన్నిచోట్ల లైన్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇబ్బడిముబ్బిడి కోతలతో ఉప కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కారణాలు ఏవైనా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఇక పుత్తూరు విద్యుత్తు డివిజన్‌ పరిధిలోని గ్రామాల్లో రోజులో కనీసం 10సార్లు నిలిపేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్తు అందిస్తామని చెబుతున్నా ఏడు గంటలు పగలు, మరో 2 గంటలు రాత్రి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌ ప్రారంభం కావడంతో రాత్రి మోటార్లు వేసేందుకు పొలాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గాలి, వాన వస్తే రెండు, మూడు గంటలు అంధకారమే. పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో మరమగ్గ కార్మికులు తరచూ కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కోతలు విధించడం లేదని, గాలి, వానతో స్తంభాలు కూలిపోతే, లైన్లు మరమ్మతుకు గురైతేనే కొద్దిసేపు సరఫరా నిలుస్తోందని డీఈఈ రెడ్డెప్ప తెలిపారు.


ఎక్కువసార్లు కోతకు శ్రీకారం

ఉమ్మడి జిల్లా తిరుపతి సర్కిల్‌ పరిధిలో 16 లక్షల విద్యుత్తు సర్వీసులుండగా.. జిల్లా విభజనతో చిత్తూరు జిల్లాలో 9లక్షలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగి వినియోగం పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో కోతలు తప్పడం లేదు. గతంలో నిర్దేశిత సమయంలో 2-3 గంటలు కోతలు విధించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ దృష్ట్యా అధికారులు తమ పంథా మార్చారు. తక్కువ సమయం(15 నుంచి 20 నిమిషాలు) పాటు ఎక్కువసార్లు కోత విధించే విధానానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. తద్వారా అసలు కోత విధిస్తున్న విషయమే తెలియదు.


రోజుకు 10 నుంచి 15 సార్లు కోతలు
- ప్రభాకర్‌, రైతు, కన్నికాపురం

చిత్తూరు అర్బన్‌ డివిజన్‌ రెడ్డిగుంట ఫీడర్‌ పరిధిలో రోజుకు కనీసం 10 నుంచి 15సార్లు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. పగటిపూట వ్యవసాయానికి సరఫరా వేళల్లోనూ కోతతో పంటలకు నీరందించ డంలో అవస్థ పడుతున్నాం. ఇక రాత్రివేళ నిర్దేశిత వ్యవధి లేకుండా కోతలు విధిస్తుండటంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం.


సాంకేతిక సమస్యలతో..
- హరి, విద్యుత్తు శాఖ, జిల్లా ప్రత్యేక అధికారి

పెనుగాలుల వర్షాలకు ఉపకేంద్రాలు, విద్యుత్తు లైన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లైన్ల మరమ్మతు, సాంకేతిక సమస్యల పరిష్కారానికి మా‌్రత్రమే కొద్దిసేపు కోత విధిస్తున్నాం. అంతరాయం లేని సరఫరాకు కృషి చేస్తున్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు