logo

బకాయిలిస్తేనే మరమ్మతులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది..

Updated : 28 Mar 2024 03:33 IST

మండుతున్న నియంత్రికలు 

అన్నదాతలకు తప్పని తిప్పలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. ఫలితంగా వీటి మరమ్మతుల్లో జాప్యం చోటుచేసుకుని అన్నదాతలకు  అవస్థలు తప్పడం లేదు.. దెబ్బతిన్న వాటిని బాగుచేయడంలో జరుగుతున్న తాత్సారం వారి పాలిట శాపంగా పరిణమిస్తోంది.. బకాయిలు చెల్లించకపోవడంతో మరమ్మతులు చేయలేమంటూ గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు.

 న్యూస్‌టుడే, చిత్తూరు (మిట్టూరు):  ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని రకాల విద్యుత్తు సర్వీసులు సుమారు 19 లక్షలు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ కనెక్షన్లు 3.1 లక్షలు ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఫీడర్లు అందుబాటులో ఉన్నాయి. సాగునీరు అందుబాటులో ఉండటం, ఎండలు తీవ్రతరం కావడంతో విద్యుత్తు వినియోగం మరింత పెరిగింది. సాంకేతిక సమస్యలతో కాలిపోయిన వాటికి ప్రత్యామ్నాయంగా మరోదాన్ని ఏర్పాటు చేయడంలో సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

గుత్తేదారులు చేతులెత్తేస్తే కష్టమే..

వీటిని మరమ్మతు చేసే గుత్తేదారులకు రూ.3 కోట్ల మేర బకాయిలు చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరులో మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. గుత్తేదారులకు కొద్ది నెలలుగా చెల్లింపులు జరగలేదు. ఇవి రూ.3-3.5 కోట్లు ఉన్నట్లు సమాచారం. రానున్న రెండు నెలలు మరమ్మతు కేంద్రాలు, గుత్తేదారుల పనితీరు ఎంతో కీలకం. ఈ సమయంలో గుత్తేదారులు చేతులెత్తేస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే.

మాటల్లోనే మార్పు..

ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఇప్పటివరకు 1500లకుపైగా నియంత్రికలు దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో అత్యధికం వ్యవసాయ సర్వీసులవే. గ్రామీణ ప్రాంతాల్లో కాలిపోయిన 48 గంటల్లోగా మార్చాలి. పలు మండలాల్లో రోజులు గడుస్తున్నా కనీసం వాటివైపు చూసేవారు కరవయ్యారు. పంటలను కాపాడుకోవాలనే తాపత్రయంతో రైతులు పక్కన ఉన్న వాటి నుంచి విద్యుత్తు సరఫరా తీసుకుని పంటలకు నీటి తడులు ఇస్తున్నారు.


త్వరలో బిల్లుల చెల్లింపు

గుత్తేదారుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం. ఇప్పటికే ఎస్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులకు బిల్లులు సమర్పించాం. జాప్యం లేకుండా మరమ్మతు చేసి నియంత్రికలు అందజేస్తున్నాం.
- మహేశ్వరరెడ్డి, ఈఈ, నియంత్రికల మరమ్మతు కేంద్రాలు, తిరుపతి సర్కిల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని