logo

వైకాపా ఫ్లెక్సీల రాజకీయం

రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విస్తృత ఏర్పాట్లు చేస్తుంటే వాటిని అడ్డుకునేందుకు అధికార వైకాపాకు చెందిన కొందరు కుయుక్తులు పన్నుతున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు.

Published : 26 May 2023 04:05 IST

తోరణాలు తొలగిస్తున్నారని తెదేపా ఆరోపణ
ఈనాడు, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విస్తృత ఏర్పాట్లు చేస్తుంటే వాటిని అడ్డుకునేందుకు అధికార వైకాపాకు చెందిన కొందరు కుయుక్తులు పన్నుతున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో నగరాన్ని శోభాయమానంగా అలకరించాలని భావించి జాతీయ రహదారికి ఇరువైపులా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నగరంలోని డివైడర్లు, ఇతర ప్రాంతాల్లో పచ్చ తోరణాలు కడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల రాత్రి సమయంలో పసుపు తోరణాల మధ్య వైకాపా తోరణాలు కడుతున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంపీ భరత్‌ తన పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగులను నెలాఖరు వరకు ఉంచాలని, తీస్తే సహించేది లేదని అధికారులను ఆదేశించినట్లు తెదేపా నాయకులు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఏ నాయకుడు పుట్టిన రోజు వేడుక నిర్వహించినా నాలుగైదు రోజులపాటు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఉంచి తరువాత తీసేయడం చేస్తుంటారు. ఎంపీ పుట్టిన రోజు మే 12న నిర్వహించినా ఇప్పటికీ నగరంలో అనేక చోట్ల హోర్డింగ్‌లు, కటౌట్లు ఉన్నాయి. మరోవైపు మహానాడు ఫ్లెక్సీలను తొలగించి వైకాపావి ఏర్పాటు చేస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు గతంలో ఎన్నడూ లేవని, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షం ఏదైనా భారీ కార్యక్రమం చేపడితే ఎటువంటి అడ్డంకులు లేవని పార్టీ సీనియర్‌ రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. ఎన్టీఆర్‌ జయంతి అంటే తెలుగు జాతి పండగని, అటువంటి మహనీయుణ్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటున్నారు.


దిగజారుడు రాజకీయాలు : గోరంట్ల

రాజమహేంద్రవరం కేంద్రంగా అనేక మంది నాయకులు రాష్ట్రస్థాయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు సమయంలో దిగజారుడు రాజకీయాలు చేయలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమానికి సంబంధించి ట్రాఫిక్‌, పార్కింగ్‌, పోలీసు బందోబస్తు అంశాలపై గురువారం తెదేపా నాయకులు జిల్లా ఎస్పీని కలిసి విన్నవించారు. అనంతరం గోరంట్ల విలేకరులతో మాట్లాడారు. వైకాపా వింత పోకడలకు పోయి నగరంలో తెదేపా కట్టిన మహానాడు బ్యానర్లను తొలగించడం సరికాదని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది వస్తారని, వారి ముందు చారిత్రక నగరం రాజమహేంద్రి పరువు తీసే చర్యలకు పూనుకోవద్దని హితవు పలికారు. ఇటువంటి దుందుడుకు చర్యల వల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని, రాజకీయాలు హుందాతనంగా చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌ సారథ్యంలో వైకాపా నాయకులు దురుద్దేశంతో తెదేపా బ్యానర్లను తొలగించడం సరికాదన్నారు. ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు వేసే విష సంస్కృతి మంచిది కాదన్నారు. ఎంపీ ఎందుకు విధ్వంసకారుడిగా మారుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పెద్ద విధ్వంసకారులను ఆనంద పర్చడం కోసం బహుశా కష్టపడుతున్నాడేమో అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతున్న ఈ ఆరాచకాలు ఖండిస్తున్నామన్నారు. గతంలో రైతు పాదయాత్ర సమయంలోనూ తప్పుడు విధానాలు అవలంబించారన్నారు. లక్షలాది మంది వచ్చే కార్యక్రమంలో ఇలాంటి పనులకు ఎవరైనా చిరాకుతో ఆవేశపడే అవకాశముందన్నారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదని, ప్రైవేటు వాహన యజమానులను భయపెడుతున్నారని ఆరోపించారు.


శాంతిభద్రతల సమస్య వస్తే అది ఎంపీ వల్లే: జవహర్‌

రాజమహేంద్రవరంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే అది ఎంపీ భరత్‌ వల్లేనని తెదేపా నాయకుడు, మాజీ మంత్రి జవహర్‌ ఆరోపించారు. మహానాడుకు రాక్షసులు మాదిరి అడ్డుపడటానికి భరత్‌ అనుచరులు ఏవిధంగా ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తోందన్నారు. ఆయన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో దళితులకు శిరోముండనం జరిగితే నోరెత్తని భరత్‌ ఇప్పుడు రెచ్చగొడుతున్నారన్నారు. ‘ప్రశాంతంగా ఉన్న రాజమహేంద్రవరాన్ని మీ చేష్టలతో రెచ్చగొడితే దాని ఫలితం అనుభవిస్తారు. మీకు, మీ కుటుంబానికి గుర్తింపు వచ్చిందంటే ఎవరివల్లో గుర్తుంచుకో’ అని ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దళితులు, బీసీల అభివృద్ధి చంద్రబాబు చేస్తే ఆయన్ను రావద్దనడానికి నువ్వెవరని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని