logo

ఈదురుగాలులు.. జోరువాన

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం కురిసిన వర్షం, ఈదురుగాలులకు విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడిపోవడంతో సరఫరా నిలిచిపోయింది.

Published : 29 May 2023 05:00 IST

నిలిచిపోయిన విద్యుత్తు సరఫరా

కంబాలచెరువు సమీపంలో నేలకూలిన చెట్టు

దేవీచౌక్‌, సీతానగరం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం కురిసిన వర్షం, ఈదురుగాలులకు విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో పాటు ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లావ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గాలివాన ప్రభావం ఎక్కువ లేని ప్రాంతాల్లో సైతం మూడు గంటల పైగా నిలిచిపోయింది. స్తంభాలు నేలకూలిన ప్రాంతాల్లో వెంటనే అధికారులు సిబ్బందిని పంపి సరఫరా పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. రాత్రి 8 గంటల వరకు రాజమహేంద్రవరం డివిజన్‌లో 10 స్తంభాలు, రెండు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. మొత్తం ఎంత నష్టం వచ్చిందనేది సోమవారానికి స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అత్యవసర మరమ్మతు పనులు చేపట్టి దశలవారీగా సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. రాజానగరం, బిక్కవోలు, రంగంపేట, సీతానగరం మండలాల్లో పలుచోట్ల స్తంభాలు కూలి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాల్లోనూ గాలులు భీభత్సం సృష్టించాయి. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని భీమనపల్లి, నంగవరం తదితర గ్రామాల్లో ఈదురు గాలలు బీభత్సం సృష్టించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని