logo

పెండ్యాలకు గ్యాస్‌ కష్టాలు

‘గ్యాస్‌ లేకపోతే వంట ఉండదు’ అనే మాటను ఇంతవరకు వింటున్నాం.. గ్యాస్‌ లేకపోతే పంట కూడా పండదని నేడు వినాల్సి వస్తోంది.

Updated : 10 Jun 2023 04:48 IST

ఖరీఫ్‌పై అన్నదాత అయోమయం
న్యూస్‌టుడే, నిడదవోలు

పంపుల నుంచి రాని సాగునీరు

‘గ్యాస్‌ లేకపోతే వంట ఉండదు’ అనే మాటను ఇంతవరకు వింటున్నాం.. గ్యాస్‌ లేకపోతే పంట కూడా పండదని నేడు వినాల్సి వస్తోంది. విచిత్రంగా అనిపించినా అది నిజం... నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు, పెరవలి మండలాల పరిధిలో సుమారు 6,200 ఎకరాలకు సాగునీరు అందించే పెండ్యాల ఎత్తిపోతల పథకం ఆయకట్టుది ఇదే పరిస్థితి. కొవ్వూరు మండలం సీతంపేట వద్ద ఉన్న జీటీపీఎస్‌లో గ్యాస్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేసేవారు. ఇందుకు వారికి నీరు అవసరం. దీని దృష్ట్యా కాటన్‌ ఆనకట్ట వెనుక నుంచి సగటున 70 క్యూసెక్కుల నీటిని వారు తీసుకుని జీటీపీఎస్‌లో టర్బయిన్ల కూలింగ్‌కు వినియోగించేవారు. అలా వినియోగించిన నీటిని వృథా కాకుండా చాలా ఏళ్లుగా పెండ్యాల ఎత్తిపోతల పథకానికి అందించేవారు. దీంతో ఈ ఆయకట్టులో రెండు పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తలేదు. గోదావరి పరిధిలోని మూడు డెల్టాల్లో రబీలో సాగునీటి కష్టాలు ఎదురై కొన్ని సందర్భాల్లో పలుచోట్ల పంట విరామం ప్రకటించినప్పుడూ ఈ 6,200 ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు ఉండేవి కావు. ఈ ఆయకట్టు రైతులు పంట విరామం ఎరుగరు. ప్రస్తుత రబీ పంటకాలం నుంచి పెండ్యాల పంపింగ్‌ స్కీంకు కష్టాలు మొదలయ్యాయి. దీనికి కారణం జీటీపీఎస్‌కు సరఫరా అయ్యే గ్యాస్‌ ధర పెరగడంతో సంస్థ నష్టాల్లోకి చేరి ఉత్పత్తి నిలిచిపోవడమే.

ముందుకు రాని గుత్తేదారులు

జీటీపీఎస్‌ ద్వారా వచ్చిన నీటితో ఆయకట్టును సాగు చేసేవారు. దీంతో పంపుహౌస్‌ అవసరం అంతగా లేకపోవడంతో పంపులు, మోటార్లు, విద్యుత్తు సదుపాయం మూలకు చేరాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో అప్పటి ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సుమారు రూ.3 కోట్లు వెచ్చించి వీటిని వినియోగంలోకి తెచ్చారు. గత రబీ నుంచి జీటీపీఎస్‌ ద్వారా నీరు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం ఇవే రైతుల అవసరాలు తీర్చుతున్నాయి. అయితే వీటి నిర్వహణతో పాటు సాగునీరు అందించే బాధ్యతను గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. రబీలో ఇలానే సాగినా, ఖరీఫ్‌కు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. టెండర్లు పిలిచినా స్పందన రాలేదు. ఈ నెల 12 నుంచి 19 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అధికారులు గడువు నిర్ణయించారు. ఇప్పుడు కూడా గుత్తేదారులు ముందుకు రాకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జూన్‌ 1నే మూడు డెల్టాలకు సాగునీటిని విడుదల చేశారు. ప్రస్తుతం పిలిచిన టెండర్‌ గడువు ముగిసేనాటికి జూన్‌ నెల మూడో వారంలోకి చేరుతుంది. ఇలా అయితే తమ ఖరీఫ్‌ పంట కాలం తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  

రూ.1.50 కోట్ల విద్యుత్తు బకాయిలు

పెండ్యాల పథకం విద్యుత్తు శాఖకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల వరకు ఉంటాయని అంచనా. రానున్న రోజుల్లో వీటిని చెల్లించాలని జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి విద్యుత్తు సరఫరా నిలుపుదల చేసే అవకాశం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఇదే అనుభవం ఎదురైంది.

బదలాయింపు దిశగా..

ఇటీవల పూర్తయిన రబీ పంట ముందు వరకు పెండ్యాల ఎత్తిపోతల పథకానికి జీటీపీఎస్‌లో టర్బయిన్ల కూలింగ్‌కు వినియోగించిన నీరు రెండు పంటలకు సరాసరి వచ్చేయడంతో పథకం వద్ద అధికారులు నిర్వహణను మరిచారు. నాలుగు పంపులు బాగానే ఉన్నా, దీనికి సంబంధించిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ పూర్తిగా పాడవడంతో రబీ పంట సమయంలో అధికారులు ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ భారంగా మారడంతో జలవనరుల శాఖ అధికారులు ఈ పథకాన్ని ఏపీఐడీసీకి బదలాయించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. రైతులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఐడీసీకి బదలాయిస్తే పంపింగ్‌ స్కీం నిర్వహణను రైతులే చేపట్టాల్సి ఉంటుంది. ఇలా రైతుల నిర్వహణలో ఉన్న పలు పంపింగ్‌ స్కీంలు ఇప్పటికే మూతపడ్డాయి. దీనిని ఐడీసీకి బదలాయిస్తే తమకు ఇబ్బందులు తప్పవని రైతులు అంటున్నారు.

గతంలో పెండ్యాల కాలువకు జీటీపీఎస్‌ నుంచి సాగునీరు వచ్చిన ప్రాంతం


సాగునీరు ఇచ్చేదెప్పుడు?

ప్రధాన కాలువకు జూన్‌ 1నే సాగునీటిని విడుదల చేశారు. ఆ ఆయకట్టు పరిధిలో చాలా మంది రైతులు నారుమళ్లు వేసుకునే పనిలో ఉన్నారు. పెండ్యాల ఆయకట్టులో మాత్రం నారుమళ్లు వేయాలా? వద్దా? అనే పరిస్థితి ఉంది. గతంలో జూన్‌ మొదటి వారంలోనే సాగునీటిని విడుదల చేసేవారు. ప్రస్తుతం నిర్వహణకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తి కాలేదు. అది ఎప్పుడు పూర్తి చేస్తారు... ఆయకట్టుకు సాగునీరు ఎప్పుడు ఇస్తారు... దీనిపై ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ముందుగా జలవనరుల శాఖ ద్వారా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి.

జె.సుబ్బారావు, రైతు


లేఖ రాశాం

పెండ్యాల పంపింగ్‌ స్కీంను ఏపీఐడీసీకి బదలాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా పంపింగ్‌ స్కీం నిర్వహణ చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటిని అందిస్తాం.

ఎస్‌.దక్షిణామూర్తి, ఈఈ, పశ్చిమడెల్టా


రెండుసార్లు టెండర్లు పిలిచాం

పెండ్యాల స్కీం నిర్వహణ నిమిత్తం ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచాం. స్పందన రాలేదు. మళ్లీ మూడోసారి టెండర్లు పిలుస్తాం. టెండర్‌ ఖరారు కాగానే సాగునీటి విడుదలకు చర్యలు తీసుకుంటాం.

వేమూరి సత్యదేవ, జలవనరుల శాఖ డీఈ, తాడేపల్లిగూడెం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు