logo

భవనం కట్టారో..పిండేస్తారు

స్టాంపులు-రిజిస్ట్రేషన్‌శాఖ తన ఆదాయ లక్ష్యాలను అధిగమించడానికి ప్రజలపై భారాలు మోపుతోంది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి భవన నిర్మాణ విలువను పెంచి రిజిస్ట్రేషన్‌ చేయాలని ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్లకు

Published : 22 May 2022 04:24 IST

ఈనాడు-అమరావతి: స్టాంపులు-రిజిస్ట్రేషన్‌శాఖ తన ఆదాయ లక్ష్యాలను అధిగమించడానికి ప్రజలపై భారాలు మోపుతోంది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి భవన నిర్మాణ విలువను పెంచి రిజిస్ట్రేషన్‌ చేయాలని ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్లకు సర్క్యులర్లు వచ్చాయి. నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీలు, మేజర్‌ పంచాయతీల్లో భవనాలకు రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు వాటికి వేర్వేరుగా ధరలు నిర్థారించి చదరపు అడుగుకు ఫీజులు విధిస్తోంది. ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.600 నుంచి రూ.1100 దాకా నిర్మాణ కేటగిరి ఆధారంగా ధరలు ఉన్నాయి. ఇవి జూన్‌ ఒకటి నుంచి కనిష్ఠంగా రూ.50 నుంచి 120 దాకా పెరగనున్నాయని రిజిస్ట్రేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే భూముల మార్కెట్‌ విలువలు సవరించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.. అది చాలదన్నట్లు తిరిగి భవనాల విలువను పెంచి రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించటంపై భవన యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  ఈ పెరుగుదలపై స్టాంప్‌డ్యూటీ లెక్కిస్తారు. దీంతో భవనాల రిజిస్ట్రేషన్‌ తడిసి మోపెడవుతుందని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కరోనా తర్వాత భవన నిర్మాణ సామగ్రి విలువలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో అపార్టుమెంట్లలో ప్లాట్ల ధరలకు బాగా రెక్కలొచ్చాయి. రెడ్డిపాలెంలో ఓ ప్లాటు గత నెలలో రూ.25 లక్షలకు కొనుగోలు చేసి కొంత అడ్వాన్స్‌ ముట్టజెప్పి రెండుమాసాల తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటామని ఒప్పందం చేసుకున్నాం. జూన్‌ ఒకటో తేది నుంచి భవన నిర్మాణాల విలువలు పెంచి రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించటంతో పెరిగే ఛార్జీలు కనీసం రూ.30 వేల నుంచి 40 వేల దాకా ఉంటాయని బిల్డర్‌ తెలియజేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని