logo

చెరుకూరు టు అమెరికా

చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది బాపట్ల గురుకుల విద్యార్థిని అక్ష. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో వేల మందితో పోటీపడి అమెరికాలో చదువుకునే అరుదైన అవకాశం దక్కించుకుంది.

Published : 09 Aug 2022 06:36 IST

జాతీయ స్థాయి పోటీ పరీక్షలో గురుకుల విద్యార్థిని అక్ష ప్రతిభ
వాషింగ్టన్‌ బ్రెమెర్టన్‌ విద్యాలయంలో ఇంటర్‌ చదివేందుకు అవకాశం
బాపట్ల, న్యూస్‌టుడే

చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది బాపట్ల గురుకుల విద్యార్థిని అక్ష. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో వేల మందితో పోటీపడి అమెరికాలో చదువుకునే అరుదైన అవకాశం దక్కించుకుంది. కెనడీ లిగర్‌ యూత్‌ ఎక్ఛేంజ్‌ స్టడీ(కేఎల్‌వైఈఎస్‌) కింద నీతిఆయోగ్‌ ద్వారా ఏటా 35 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి కేంద్రం సొంత నిధులను వెచ్చించి పంపిస్తుంది. పోటీ పరీక్షలో సత్తా చాటి వాషింగ్టన్‌ బ్రెమెర్టన్‌ విద్యాలయంలో సీటు దక్కించుకుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన విద్యార్థులతో కలిసి అక్ష దిల్లీ నుంచి విమానంలో అమెరికాకు సోమవారం పయనమైంది. మొదటి నుంచి చదువులో రాణిస్తూ విశేష ప్రతిభ చాటిన అక్ష ప్రస్థానం గురించి తెలుసుకుందామా..

పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన కొమరాబత్తిన అక్ష నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి మరియరాజు టీకొట్టు నిర్వహిస్తున్నారు. తల్లి రత్నకుమారి దర్జీగా పని చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. నరసాయపాలెం గురుకులంలో 9, 10 తరగతులు చదివింది. ప్రిన్సిపల్‌ వినీత విద్యార్థినిలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. పదో తరగతి ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించింది. 2021లో బాపట్ల బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో చేరింది. 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. అమెరికాలో విద్య అభ్యసించడానికి దేశవ్యాప్తంగా జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు నీతిఅయోగ్‌ 2021లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో వేల మంది విద్యార్థులతో అక్ష పోటీ పడింది. తొలి ప్రయత్నంలో విఫలమై పరీక్షలో అర్హత సాధించలేదు. అపజయానికి విద్యార్థిని కుంగిపోలేదు. మరింత పట్టుదలతో కష్టపడి చదివి కేంద్రం రెండోసారి పోటీ పరీక్ష రాయడానికి కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తుది పరీక్షలో ఎంపికైన 125 మందికి గతేడాది సెప్టెంబరులో మౌఖిక పరీక్ష నిర్వహించి 35 మంది ప్రతిభావంతులకు అమెరికాలో ద్వితీయ ఇంటర్‌ స్థాయి విద్య అభ్యసించడానికి కేంద్రం ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఎంపికైన ముగ్గురిలో అక్ష ఒకరు. మారుమూల గ్రామం చెరుకూరు నుంచి వచ్చిన విద్యార్థిని అమెరికా వాషింగ్టన్‌ బ్రెమెర్టన్‌ ఉన్నత పాఠశాలలో పది నెలలు సీనియర్‌ ఇంటర్‌ చదివేందుకు అవకాశం దక్కించుకుని సొంతూరితో పాటు గురుకుల విద్యాలయకు గర్వకారణంగా నిలిచింది. బాపట్ల గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్‌ భవానీదేవి, అధ్యాపకులు రూ.లక్ష విరాళం అందజేసి ఆ నగదుతో విద్యార్థినికి దుస్తులు, సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌, పరికరాలు అందజేశారు. అక్షను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్‌ అభినందించి సత్కరించారు. మూడ్రోజుల క్రితం గన్నవరం నుంచి దిల్లీ చేరుకున్న విద్యార్థిని సహచర విద్యార్థులతో కలిసి సోమవారం అమెరికా బయలుదేరి వెళ్లింది.


మంత్రి మేరుగ నాగార్జున నుంచి అభినందనలు అందుకుంటున్న విద్యార్థిని అక్ష

గొప్ప అవకాశంగా భావిస్తున్నా..
ప్రాథమిక పరీక్షలో తొలి ప్రయత్నంలో వైఫల్యం చెందడంతో కొంత నిరాశకు గురయ్యా. ప్రిన్సిపల్‌ భవానీదేవి, అధ్యాపకులు జయలక్ష్మి, అనూరాధ ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. వారిచ్చిన ధైర్యంతో రెండో ప్రయత్నంలో రోజూ ఐదు గంటలు కష్టపడి చదివి ఆంగ్లంలో పట్టు సాధించి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి విజయం సాధించా. నా తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో అంతా గురుకుల విద్యాలయ అధ్యాపకులే చూసుకున్నారు. పదో తరగతిలోనే నాలో ప్రతిభను గుర్తించి నరసాయపాలెం గురుకులం ప్రిన్సిపల్‌ వినీత, ఉపాధ్యాయిని సరళ ఎంతగానో ప్రోత్సహించారు.

- అక్ష, విద్యార్థిని

మా సొంత బిడ్డ వెళ్లినట్లుగా ఉంది
మా గురుకులం విద్యార్థిని అక్ష అమెరికాలో విద్య అభ్యసించటానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తే విజయాలు సాధిస్తారనడానికి అక్ష ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. వేల మంది విద్యార్థులతో పోటీ పడిన అక్ష తన ప్రతిభతో గొప్ప అవకాశాన్ని దక్కించుకుంది. అక్ష అమెరికా వెళ్తుంటే మా సొంత బిడ్డ వెళ్లినట్లుగా ఉంది.

- కె.భవానీదేవి, ప్రిన్సిపల్‌, బాపట్ల అంబేడ్కర్‌ గురుకులం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని