logo

పోలీసు దిగ్బంధంలో ముఖ్యమంత్రి నివాసం

వాల్మీకి, కులస్థులను ఎస్టీలో చేర్చవద్దని కోరుతూ గిరిజన సంఘాలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Published : 29 Nov 2022 04:51 IST

తాడేపల్లి వద్ద అడుగడుగునా తనిఖీలు చేస్తున పోలీసులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: వాల్మీకి, కులస్థులను ఎస్టీలో చేర్చవద్దని కోరుతూ గిరిజన సంఘాలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో సీఎం నివాసాన్ని పోలీసులు సోమవారం దిగ్బంధించారు. నివాసం చుట్టూ నిరంతరం కొనసాగే చెక్‌ పోస్టులకు అదనంగా ఏర్పాటు చేశారు. దాదాపు 350 మంది పోలీసు బలగాలను మోహరించి అదనపు బందోబస్తును నిర్వహించారు. వేకువజాము నుంచే పోలీసు బలగాలు తాడేపల్లిలోని సీఎం నివాసం చుట్టూ కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. సీఎం నివాసానికి వెళ్లే మార్గాలతో అనుసంధానంగా రోడ్లన్నింటిని పోలీసులు మూసివేశారు. అడుగడుగునా ఆంక్షలను విధించారు. విజయవాడ నుంచి తాడేపల్లి చేరుకునే మార్గంలోని వారధి ప్రాంతంలో సర్వీసు మార్గాన్ని మూసివేశారు. తాడేపల్లి వెళ్లాల్సిన వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రాతూరు కరకట్టపై నుంచి విజయవాడ వెళ్లే రేపల్లె ఆర్టీసీ బస్సులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రమాదకరమైన మార్గాల్లో బస్సులను అతికష్టంపై జాతీయ రహదారిపైకి చేరుకోవాల్సి వచ్చింది. గుంటూరు వైపు నుంచి తాడేపల్లి వెళ్లాల్సిన వాహనాలను సైతం సర్వీసు మార్గాల్లో పోలీసులు నిలిపివేశారు. ఫలితంగా విజయవాడ, గుంటూరు వెళ్లాల్సిన ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. సర్వీసు మార్గం నుంచి సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో వాహనాలను నిలిపివేశారు. ఉన్నత న్యాయస్థానం, అమరావతి సచివాలయానికి వెళ్లే వారు ఇబ్బందులకు గురయ్యారు. సచివాలయానికి వెళ్లే ప్రధాన మార్గం కావడం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లేవారి బాధలు అంతా ఇంతా కాదు. ఎటువెళ్లినా రోడ్లను పోలీసులు దిగ్బంధించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారధి వద్ద ఇరువైపులా, తాడేపల్లి నుంచి బైపాస్‌కు వెళ్లే వంతెన వద్ద, ప్రకాశం బ్యారేజీ, ప్రాతూరు క్రాస్‌ రోడ్డును చెక్‌ పోస్టులతో మూసివేశారు. ఏ క్షణానైనా గిరిజన సంఘాలు సీఎం నివాస ముట్టడికి వస్తారనే ఉద్దేశంతో సాయంత్రం వరకు బందోబస్తు కొనసాగించారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్‌ 52 రద్దు చేయాలన్న డిమాండ్‌తో గిరిజన సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చింది. పోలీసులను భారీగా మోహరించడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడికక్కడ గిరిజన సంఘాల నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని