logo

బాబోయ్ బండరాళ్లు

నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధి నిర్మాణ పనులకు పనికి రాని గ్రానైట్ బండరాళ్లను భారీ వాహనాలపై తరలిస్తున్నారు.

Updated : 02 Dec 2022 07:52 IST

ప్రమాదకరంగా తరలించడంతో ఆందోళనలో వాహనచోదకులు
అధిక లోడుతో కుంగుతున్న రహదారులు

టిప్పరుకు బండరాళ్లు లోడు చేస్తున్న పొక్లెయిన్‌

బల్లికురవ, మార్టూరు, పర్చూరు, న్యూస్‌టుడే: నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధి నిర్మాణ పనులకు పనికి రాని గ్రానైట్ బండరాళ్లను భారీ వాహనాలపై తరలిస్తున్నారు. వీటి రవాణా అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది. లారీలపై పరిమితికి మించి వేస్తున్న బండలతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ లోడు వాహనాలు రహదారి అంచుకు వెళితే కూరుకుపోయే ప్రమాదంతో పాటు రోడ్లు కుంగిపోతున్నాయి. పరిస్థితి ఇంతలా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మార్టూరు, బల్లికురవ, గురిజేపల్లి ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఎక్కవగా ఉండటంతో వాటి నుంచి వచ్చే వ్యర్థాలను ఒక ప్రాంతంలో డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి వాటిని నిజాంపట్నం హార్బరు నిర్మాణానికి తరలిస్తున్నారు. నెల రోజుల నుంచి 70 టిప్పర్లు నిత్యం పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్కో టిప్పరు రోజుకు రెండు మూడు ట్రిప్పులు వేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సగటున 150 నుంచి 200 వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 10, 12 చక్రాల వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. 10 టైర్ల టిప్పర్‌ 28 టన్నులు, 12 టైర్ల టిప్పరు 35 టన్నులు, 14 టైర్ల టిప్పర్‌ 42 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటాయి. అదే వాహనాలపై 35 నుంచి 50 టన్నుల వరకు తరలిస్తున్నారు. రహదారులు కుంగి మరమ్మతులకు గురవుతున్నాయి. విజిలెన్స్‌ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి పరిమితికి మించి ఉన్న బరువుకు టన్నుకు రూ.2 వేల చొప్పున, యజమానికి రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు.

ప్రాణాలు అరచేతిలో పట్టుకొని..

టిప్పర్లపై క్రమ పద్ధతి లేకుండా రాళ్లు తరలించడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎక్కువ టన్నులు తరలిస్తే బాడుగ అధికంగా వచ్చే అవకాశం ఉంటటంతో ఎక్కువ రాళ్లను తరలిస్తున్నారు. వేగ నిరోధకాల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటోంది. ప్రజలకు, వాహన చోదకులకు రాళ్లు కనిపించకుండా టిప్పర్లపై నీలం రంగు పట్టలు కప్పి తరలిస్తున్నారు. చీరాల ప్రాంతంలో జన సంచారం ఎక్కవగా ఉన్న ప్రదేశంలో వేగంగా రాకపోకలు సాగిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. మార్టూరు ప్రాంతం నుంచి గ్రానైట్‌ రాళ్లను తరలిస్తున్నారు. భారీ లోడుతో లారీలు  పెద్ద సంఖ్యలో తిరగడం వల్ల పర్చూరు-మార్టూరు మధ్య రహదారి, వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో పర్చూరు-కారంచేడు మధ్య నిర్మాణం దెబ్బతింది. పర్చూరు నుంచి జాగర్లమూడి వైపు కొన్ని చోట్ల అడుగు నుంచి రెండడుగుల వరకు రోడ్డు కుంగింది. కొన్నిచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వంతెనలు వణుకుతున్నా పట్టించుకోవడం లేదు. రెండు నెలల వ్యవధిలో రహదారుల రూపురేఖలు మారి అధ్వానంగా మారడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్‌ అంచులకు పైగా రాళ్లు వేయడం వల్ల మార్గంమధ్యలో జారి పడిపోతున్నాయి. అలా పడే సమయంలో వెనుక నుంచి వాహనాలు వస్తున్నా, లేదా ప్రజలున్నా  ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం యద్దనపూడి మండలం జాగర్లమూడి వద్ద పెద్ద రాయి లారీ నుంచి జారిపడింది. అదృష్టవశాత్తు రోడ్డు అంచున పడడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. తక్షణం రవాణా అధికారులు అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తక్షణం చర్యలు తీసుకుంటాం

అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెడతాం. రవాణా శాఖ అధికారులతో రహదారులపై ప్రత్యేక తనిఖీలు చేయిస్తాం. జరిమానాలు విధించడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం. చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా రవాణాధికారి

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు