logo

పేరుకే సర్దుబాటు.. మరి చేరే వారేరి?

ఉపాధ్యాయుల సర్దుబాటుపై ముఖ్యమంత్రి చెబుతున్నదానికి భిన్నంగా ప్రజాప్రతినిధుల తీరు ఉంటోంది.

Published : 07 Feb 2023 06:02 IST

టీచర్ల రిలీవింగ్‌కు మోకాలొడ్డుతున్న ప్రజాప్రతినిధులు

విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలి. ఈ విషయంలో రాజీ ధోరణి వీడండి. అవసరం మేరకు టీచర్లను సర్దుబాటు చేసుకుని కొరత లేకుండా చూసుకోవాలి.

పాఠశాల విద్య సమీక్షల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నోట పదేపదే వచ్చే మాటిది.


ఈనాడు-అమరావతి: ఉపాధ్యాయుల సర్దుబాటుపై ముఖ్యమంత్రి చెబుతున్నదానికి భిన్నంగా ప్రజాప్రతినిధుల తీరు ఉంటోంది. తాము చెప్పిన ఏ టీచరును రిలీవ్‌ చేయొద్దని హుకుం జారీ చేస్తున్నారు. యంత్రాంగం స్థాయిలో ప్రక్రియ పూర్తయినా అడుగుముందుకు వేయలేని పరిస్థితి.

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా  అనేక పాఠశాలల్లో ఇప్పటికీ కొన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులే లేరంటే అతిశయోక్తి కాదు. ముగ్గురు చెప్పే సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సి వస్తోంది. దీంతో అంతా మొక్కుబడిగా సాగుతోంది.

ఐదేళ్ల నుంచి హిందీ బోధిస్తున్న అబ్దుల్‌ రజాక్‌


మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లోని వీవర్స్‌ కాలనీలో పురపాలక ఉన్నత పాఠశాలలో 1160 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ హెచ్‌ఎంతో కలిపి 15 మంది రెగ్యులర్‌ ఉపాధ్యాయులు ఉన్నారు  తెలుగు బోధనకు ఒక్కరంటే ఒక్కరూ లేరు. మిగిలిన సబ్జెక్టులకు ఒక్కో టీచర్‌ మాత్రమే ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ పది మంది టీచర్ల అవసరం ఉంది.  సర్దుబాటులో మంగళగిరి మండలం పెదవడ్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి బయాలజీ టీచర్‌ ఒక్కరే వచ్చారు.


రేపల్లె నియోజకవర్గం నగరం మండలంలోని అద్దంకివారిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్‌ టీచర్ల కొరత ఉంది. ఆరేపల్లి యూపీ నుంచి వేసినా టీచర్‌ చేరలేదు. ప్రస్తుతం ఇక్కడ సోషల్‌ బోధించే వారు ఒక్కరూ లేరు. బయట పాఠశాలల నుంచి రావల్సిన టీచర్లు ప్రజాప్రతినిధి పేరు చెప్పి తప్పించుకుంటున్నారు.


మాచవరం మండలం మోర్జంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 440 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ సోషల్‌ బోధనకు ఇద్దరు ఉపాధ్యాయులు అవసరమైతే కేవలం ఒకరితోనే నెట్టుకొస్తున్నారు. పిన్నెల్లి నుంచి ఒక టీచర్‌ను వేసినా చేరలేదు.

రత్నాలచెరువు పురపాలక ఉన్నత పాఠశాలలో 350 మందికి పైగా విద్యార్థులు ఉండగా ఇక్కడ టీచర్ల కొరత వేధిస్తోంది. సర్దుబాటులో ఒక్కరూ రాకపోవటంతో ఉన్న వారిపైనే భారం పడుతోందని ఆవేదన చెందుతున్నారు.


తెనాలి ఐతానగర్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ రెగ్యులర్‌ ఉపాధ్యాయులు ఐదుగురు, డిప్యూటేషన్‌పై మరో నలుగురు పనిచేస్తున్నారు. ఇక్కడా టీచర్లు సరిపడా లేకపోవటంతో బోధనకు ఆటంకం కలుగుతోంది.


విజయపురిసౌత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 528 మంది విద్యార్థులు ఉన్నారు. నేచురల్‌ సైన్స్‌, తెలుగు బోధించే ఉపాధ్యాయులే లేరు. సోషల్‌కు ఒక్కరే దిక్కు. మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో సెలవులు పెట్టడానికి వీల్లేకుండా ఉందని అక్కడి ఉపాధ్యాయులు అంటున్నారు.


సత్తెనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల (సుగాలీకాలనీ)లో 1100 మంది విద్యార్థులు ఉంటే హిందీ బోధనకు కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. భౌతికశాస్త్రం బోధనకు ముగురు ఉపాధ్యాయులు ఉండగా వారిలో ఒకరు వ్యక్తిగత సెలవులో విదేశాల్లో ఉండగా, రెండోవారు హెచ్‌ఎం బాధ్యతల్లో ఇంచార్జిగా ఉన్నారు. ఫిజిక్స్‌ బోధనకు టీచర్ల కొరత నెలకొంది. ఫణిదం, కంటిపూడి పాఠశాలల నుంచి ఇద్దరు మిగులు టీచర్లను వేసినా వారు విధుల్లో చేరలేదు. ఇక్కడి నుంచి మాత్రం ఇద్దరు ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు పంపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు