logo

తెదేపా విజయోత్సాహం

రాష్ట్రంలో మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ పదవులకు జరిగిన ఎన్నికల్లో మూడుచోట్లా తెదేపా అభ్యర్థులు విజయం సాధించడంతో శనివారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బాపట్ల, గుంటూరు, పల్నాడులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

Published : 19 Mar 2023 05:08 IST

ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుపై పార్టీ శ్రేణుల సంబరాలు
ఈనాడు - గుంటూరు

తెదేపా జెండాలు చేతపట్టుకుని సైకో పోవాలి... సైకిల్‌ రావాలంటూ నాయకులు, కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తున్న మహమ్మద్‌ నసీర్‌

రాష్ట్రంలో మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ పదవులకు జరిగిన ఎన్నికల్లో మూడుచోట్లా తెదేపా అభ్యర్థులు విజయం సాధించడంతో శనివారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బాపట్ల, గుంటూరు, పల్నాడులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఆయా జిల్లాల్లో నేతలు, కార్యకర్తలు బాణసంచా పేల్చి కేకులు కోసి ఆనందం పంచుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. పట్టణాల్లో విజయోత్సవ ర్యాలీలు చేసి ప్రజలు మార్పునకు నాంది పలికారని నినాదాలు చేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని నేతలు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడులో తెదేపా అభ్యర్థుల విజయంపై నేతలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి బాణసంచా పేల్చారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఆపార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుని బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి చదలవాడ ఆరవిందబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, కారంపూడిలో సంబరాలు జరిపారు. గురజాల పట్టణంలో తెదేపా శ్రేణులు కేక్‌ కోసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాటి నివాసం నుంచి నరసరావుపేట సెంటర్‌ వరకు ర్యాలీ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైకాపా పతనానికి నాంది అని పుల్లారావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ఆరాచకాలు, అక్రమాలకు స్పష్టమైన ప్రజాతీర్పు అని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో మార్టూరులో తెదేపా కార్యాలయంలో ఆపార్టీ నేతలు పెద్దఎత్తున బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. చినగంజాం మండలం సంతరావూరులో నేతలు కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు.

పెదవడ్లపూడి శివాలయం కూడలిలో తెదేపా నాయకుల కోలాహలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని