logo

కూరగాయలకూ వడదెబ్బ!

ఠారెత్తిస్తున్న ఎండలు కూరగాయలపైనా ప్రభావం చూపాయి. విపరీతమైన వేడి, వడగాలుల వల్ల దిగుబడులు తగ్గాయి. అదే విధంగా మార్కెట్కు వస్తున్న సరకు కూడా ఈ ఎండలకు త్వరగా పాడైపోతోంది.

Published : 09 Jun 2023 06:02 IST

తగ్గిన దిగుబడి
మండుతున్న ధరలు

తెనాలి ప్రధాన రైతు బజార్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తున్న ప్రజలు

న్యూస్‌టుడే, తెనాలిటౌన్‌: ఠారెత్తిస్తున్న ఎండలు కూరగాయలపైనా ప్రభావం చూపాయి. విపరీతమైన వేడి, వడగాలుల వల్ల దిగుబడులు తగ్గాయి. అదే విధంగా మార్కెట్కు వస్తున్న సరకు కూడా ఈ ఎండలకు త్వరగా పాడైపోతోంది. ఈ క్రమంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. దీనితో ప్రజలపై మరో భారం పడింది.

జిల్లాలోని గుంటూరు నగరంలో 3, తెనాలి పురపాలికలో 6, పొన్నూరు పురపాలికలో 1, మంగళగిరిలో-1 వెరసి మొత్తం 11 రైతు బజార్లు ఉన్నాయి. వీటికి నారాకోడూరు, సుద్దపల్లి, కొలకలూరు, నందివెలుగు, వేటపాలెం, మంచికలపూడి, పొన్నూరు, జంపని, లంక గ్రామాల నుంచి కూరగాయలు వస్తాయి. ప్రస్తుతం టమోటా మదనపల్లి నుంచి వస్తుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ కూరగాయల పంటలపై అధిక ఉష్ణోగ్రతలు ప్రభావం చూపాయి. కాగా బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు మరింత అధికంగా ఉన్నాయి.


అరకిలో.. పావుకిలోతో సరి

వేసవి సెలవల కారణంగా గత రెండు నెలల నుంచి ప్రైవేటు పాఠశాలలు మూసి వేయడం వల్ల వేతనాలు లేవు. రోజు జీవనమే గగనం అయితే ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగిపోవడంతో మరింత భారం పడింది. కిలోకు బదులు అరకిలో, అరకిలోకు బదులు పావుకిలో కొనుగోలు చేయడం తప్ప మరో మార్గం లేదు.

నళిని, ప్రైవేటు ఉపాధ్యాయిని


నిత్యావసరాలకు ఇప్పుడు కూరగాయలు జత అయ్యాయి

మాది మధ్య తరగతి కుటుంబం. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయంలో పెరుగుదల లేదు. గత కొంతకాలం నుంచి నిత్యావసర ధరల పెరుగుదలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. వారానికోసారి ప్రతి వస్తువూ పెరుగుతోంది. ఎలాగోలా ఉన్న దాంట్లో నెట్టుకొస్తుంటే ఇప్పుడు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత నెలలో రూ.200కు వారం రోజులకు సరిపడా కూరగాయలు వస్తే ఇప్పడు వాటి కోసమే రూ.400 ఖర్చు చేయాల్సి వచ్చింది. నెల మొత్తం మీద చూసుకుంటే ఇంటి బడ్జెట్ పెరిగిపోతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

జాహ్నవి, గృహిణి


వానలు పడటం మొదలైన తర్వాత కొత్త పంటలు అందుబాటులోకి వస్తే ధరలు కొంత తగ్గుతాయని తెనాలి ప్రధాన రైతు బజార్‌ పర్యవేక్షణాధికారి రామకృష్ణ తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని