logo

నిధులు దోచేయ్‌

అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Published : 28 Mar 2024 06:18 IST

బదిలీపై వెళ్లిన అధికారి సంతకంతో బిల్లుల చెల్లింపులు

 బల్లికురవ, న్యూస్‌టుడే: అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో రెండు మూడు నెలల క్రితం ఆర్‌డబ్ల్యూఎస్‌ డివిజన్‌ స్థాయి అధికారి ఒకరు నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆ ఏఈ గతంలో ఆ అధికారితో ఉన్న సంబంధాలను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ విధుల్లో ఉన్న అధికారి సంతకం కాకుండా పాత అధికారి సంతకంతోనే పనులు చేసిన వైకాపా నాయకులకు బిల్లులు చేయిస్తున్నారు. బదిలీపై వెళ్లి చాలా రోజులు గడుస్తున్నా ఆ అధికారి సంతకంపై ఎలా బిల్లులు చేస్తున్నారనే సమాచారం బయటకు పొక్కకుండా ఏఈ జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తించే అధికారి అయితే క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించాకే బిల్లులు చేస్తారని భయపడి, ఆయనికి తెలియకుండా పాత అధికారి సంతకంతోనే బిల్లులు చేస్తున్నారు. ఇటీవల మండలంలోని ఓ గ్రామంలోని వంతెన సమీపంలో మంచినీటి పైపుల మరమ్మతుల కోసం రూ.3.50 లక్షల నిధులు డ్రా చేశారు. మంచినీటి పథకాల నిర్వహణ సక్రమంగా లేనప్పటికీ గుత్తేదారులకు పాత అధికారి సంతకంతోనే బిల్లులు చేస్తున్నారనే ఆరోపణలు ఏఈపై ఉన్నాయి. ఆయా గ్రామాల్లో నీటి ట్యాంకుల నిర్వహణ చూసే బాధ్యత, పైపులైన్లకు పనులు చేసే గుత్తేదారులు అధికార పార్టీకి చెందిన వైకాపా నాయకులే కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని