icon icon icon
icon icon icon

NDA: పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్‌దే బాధ్యత: ఎన్డీయే కూటమి

పింఛన్ల పంపిణీలో సీఎస్‌ జవహర్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీయే కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు.

Updated : 27 Apr 2024 17:01 IST

అమరావతి: పింఛన్ల పంపిణీలో సీఎస్‌ జవహర్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఎన్డీయే కూటమి నేతలు సచివాలయంలో ఆకస్మిక ధర్నాకు దిగారు. సీఎం, సీఎస్‌ కార్యాలయాలు ఉండే మొదటి బ్లాక్‌ వద్ద మెట్లపై బైఠాయించి ఆందోళన చేశారు. సీఎం జగన్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎస్‌కు ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నేతలు సీఎస్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మే నెల పింఛను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులు సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు. దీనిపై సీఎస్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కూటమి నేతలు అక్కడే బైఠాయించి సీఎస్‌ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉన్నాధికారుల పొరపాటు, నిర్లక్ష్యం, దురుద్దేశం వల్ల 33 మంది వృద్ధులు పింఛను కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద పెట్టిన ప్రభుత్వం.. పింఛను పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా? అని ప్రశ్నించారు. మే నెల పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. తెదేపా నేత దేవినేని ఉమా, జనసేన నేత శివశంకర్‌, భాజపా నేత లంకా దినకర్‌ తదితరులు నిరసన తెలిపిన వారిలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img