Hyderabad News: ప్రిన్సిపల్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్‌ పోసుకొని

Updated : 19 Aug 2022 15:51 IST

అంబర్‌పేట: నగరంలోని అంబర్‌పేట పరిధిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. కళాశాలలోనే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. టీసీ కోసం మాట్లాడుతూ ప్రిన్సిపల్‌ ఎదుటే విద్యార్థి నిప్పంటించుకున్నాడు. విద్యార్థిని అడ్డుకునే క్రమంలో ప్రిన్సిపల్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రిన్సిపల్‌ టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. అందుకే ఆ విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. ఈ ఘటనతో ప్రిన్సిపల్‌ గదిలో మంటలు అంటుకుని ఏసీతో పాటు అక్కడి సామగ్రి కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

మరోవైపు ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ దగ్గర ధర్నా చేపట్టారు. కొంతమంది కళాశాలపై దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తూర్పు మండల అదనపు డీసీపీ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. 

ఫీజు రెగ్యులేషన్‌ కమిటీ ఏర్పాటు చేయాలి..

ఫీజుల పేరుతో విద్యార్థులను అనుక్షణం వేధింపులకు గురిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వేధింపులకు విద్యార్థులు మనస్తాపం చెంది ఆక్రోశంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ గుట్టుచప్పుడుకాకుండా వీటిని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రెగ్యులేషన్‌ కమిటీని ఏర్పాటుచేయాలి. ఇష్టారీతిన ఫీజుల వసూలు చేస్తున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఫీజులను ప్రభుత్వమే నిర్ధారించాలి.  -ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని