logo

పిల్లులు, పిచ్చుకలు.. కరెంటుకు కొత్త చిక్కులు!

నగరంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థకి సరికొత్త చిక్కొచ్చి పడింది. అనుకోని అతిథులు ఉప కేంద్రాల్లోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోకి ప్రవేశించి సరఫరా వ్యవస్థకు ఊహించని నష్టం కలిగిస్తున్నాయి.

Updated : 27 Mar 2024 04:07 IST

అంతరాయాలకు కారణమవుతున్న మూగజీవాలు
తిప్పలు పడుతున్న విద్యుత్తు సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థకి సరికొత్త చిక్కొచ్చి పడింది. అనుకోని అతిథులు ఉప కేంద్రాల్లోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోకి ప్రవేశించి సరఫరా వ్యవస్థకు ఊహించని నష్టం కలిగిస్తున్నాయి. పిల్లులు, పిచ్చుకలు, బల్లులు.. విద్యుత్తు సిబ్బంది, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. 11కేవీలో తరచూ, 33కేవీలో అరుదుగా బ్రేక్‌డౌన్లకు కారణమవుతున్నాయి. మంగళవారం ఇలాంటి ఘటనే మీర్‌పేట నందనవనం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో జరిగింది. అక్కడున్న 33కేవీ ఉపకేంద్రంలో ఉదయం బ్రేక్‌డౌన్‌ అయ్యింది. పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (పీటీఆర్‌) మీద నుంచి పిల్లి దూకడాన్ని సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ గమనించాడు. సబ్‌స్టేషన్‌ నుంచి కాలనీలకు సరఫరా అయ్యే బ్రేకర్‌ లింబ్‌పై పిల్లి దూకడంతో బ్రేక్‌డౌన్‌ సమస్య తలెత్తినట్లు ఇంజినీర్లు తెలిపారు. ప్రత్యామ్నాయ సరఫరాతో 15 నుంచి 20 నిమిషాల్లో కొన్ని కాలనీలకు కరెంటు పునరుద్ధరించారు. మిగిలినవాటికి దాదాపు గంట సమయం పట్టింది. పిల్లి కాలికి గాయమైంది.

గతంలోనూ తరచూ..

పిచ్చుకలు, బల్లులు, పాములవంటి మూగజీవాలతో 11కేవీ ఫీడర్లలో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. జైన్‌ మందిర్‌ ఫీడర్‌లో పక్షి పడటంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. కొత్తపేట ఉప కేంద్రంలో పరిధిలో ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ ఇన్సులేటర్‌పై పక్షి వాలడంతో ఫీడర్‌ బ్రేక్‌డౌన్‌ అయ్యింది. బల్లులతో లైన్‌ ట్రిప్‌ అయిన ఉదంతాలు ఈ వేసవిలోనే పలుచోట్ల జరిగాయి. ఇటీవల ఒక ట్రాన్స్‌ఫార్మర్‌పై పాము పాకుతున్న వీడియో సైతం వైరలైంది. చాలావరకు ఓవర్‌హెడ్‌ తీగలే కావడంతో వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల సమయంలో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈదురుగాలులు వీచినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు, అధిక ఉష్ణోగ్రతలకు ఓవర్‌లోడ్‌తో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మూగ జీవాలతో కొత్త సమస్య ఎదురవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని