logo

పైసలు కాదు.. ప్రయాణమే ముఖ్యం

ఇరవై కిలోమీటర్ల సిటీ బస్సు ప్రయాణానికి రూ.35.. 20 కిలోమీటర్ల మెట్రో ప్రయాణానికి రూ.50 వసూలు చేస్తున్నారు.. 20 కిలోమీటర్ల ఎంఎంటీఎస్‌ ప్రయాణానికి కేవలం రూ.5 మాత్రమే. బస్సులో గంటలకొద్దీ ప్రయాణ సమయం పడుతున్నా..

Published : 29 Mar 2024 03:42 IST

సమయపాలన లేక ఎంఎంటీఎస్‌లకు దూరమవుతున్న  ప్రయాణికులు
ధరెక్కువైనా.. బస్సు, మెట్రోలకే జై

ఈనాడు, హైదరాబాద్‌: ఇరవై కిలోమీటర్ల సిటీ బస్సు ప్రయాణానికి రూ.35.. 20 కిలోమీటర్ల మెట్రో ప్రయాణానికి రూ.50 వసూలు చేస్తున్నారు.. 20 కిలోమీటర్ల ఎంఎంటీఎస్‌ ప్రయాణానికి కేవలం రూ.5 మాత్రమే. బస్సులో గంటలకొద్దీ ప్రయాణ సమయం పడుతున్నా.. సీటు దొరక్కపోయినా, కాలుష్యం బారిన పడుతున్నా..అందులోనే ప్రయాణిస్తున్నారు. కారణం సకాలంలో ఎంఎంటీఎస్‌లు అందుబాటులో లేకపోవడమే. పైసలకు కాదు సమయానికే ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు.

ప్రయాణికులు తగ్గడానికి కారణాలెన్నో..

  • మొత్తం 140 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌లు పరుగులు పెడుతున్నా ప్రయాణించేవారు 40 వేలకు మించడంలేదు.
  • రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం లోకల్‌ రైళ్లకు అధిక ప్రాధాన్యమివ్వాలి. ద.మ. రైల్వే పరిధిలో అది అమలుకావడం లేదు.
  • పెద్దగా ఆదాయం ఉండదని.. ఏ చిన్నకారణం దొరికినా సర్వీసులను రద్దు చేస్తుండటం
  • సమయపాలన లేకపోవడం.. సర్వీసు ఉంటుందన్న గ్యారంటీ లేకపోవడం
  • ఉదయం, సాయంత్రం కార్యాలయాలు, కళాశాలల సమయంలో ఎంఎంటీఎస్‌లు ఉన్నా, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సగానికి సగం రద్దుకావడం
  • దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, గూడ్సు రైళ్లకు ప్రాధాన్యమిచ్చి.. ఆ సమయంలో అడ్డుగా ఉంటాయని ఎంఎంటీఎస్‌లను రద్దు చేస్తుండటం
  • మేడ్చెల్‌ - సికింద్రాబాద్‌ మధ్య 10 సర్వీసులు ప్రతి రోజూ ఆలస్యమే.
  • ఘట్‌కేసర్‌ - లింగంపల్లి మధ్య రెండు సర్వీసులే నడుపుతుండటం
  • తెల్లాపూర్‌ వరకూ నగరం విస్తరించినా రెండు సర్వీసులకే పరిమితం చేయడం
  • ప్రయాణికుల లేకపోవడంతోనే ఎంఎంటీఎస్‌లు నడపడం లేదని ద.మ.రైల్వే చెబుతుంటే..  సమయపాలన పాటించకపోవడంతోనే ప్రయాణికులు దూరమయ్యారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు.

చౌకగా ప్రయాణించే అవకాశం ఉన్నా..

కేవలం రూ.5 టికెట్‌తో 20 కి.మీ., రూ.10తో 40 కి.మీ.,రూ.15తో 60 కి.మీ. ప్రయాణించే వెసులుబాటున్నా ఎంఎంటీఎస్‌లు ఎక్కడంలేదు. ఎంఎంటీఎస్‌ మొదటి దశ 45 కి.మీ.కు రెండోదశలో 95 కి.మీ.  తోడైనా ప్రయాణికులు పెరగలేదు. మెట్రోలేని మార్గాలతో పాటు శివార్లను కలుపుతూ నలువైపులా అందుబాటులోకొచ్చినా అదే పరిస్థితి. సర్వీసుల సంఖ్య పడిపోయింది. ఒకప్పుడు 45 కి.మీ. మేర విస్తరించిన మొదటి దశలో 121 సర్వీసులు 1.20 లక్షల మందితో నడవగా... విస్తరించిన తరువాత ఎందుకు చతికిలబడిందంటే అనేక కారణాలున్నాయని నగర ప్రయాణికులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని