logo

అదనపు భారం.. రూ.3 కోట్ల పైమాటే!

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస దూరం కలిగిన చిరునామాకు ఎల్పీజీ సిలిండర్లను చేర్చినందుకు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవరసరం లేదు. అయితే కార్మికుల శ్రమ దృష్ట్యా వినియోగదారులు సిలిండర్‌ ధరకు అదనంగా చెల్లించే

Published : 21 Jan 2022 03:18 IST

సిలిండర్ల రవాణాలో చేతివాటం

జగిత్యాల విద్యానగర్‌, న్యూస్‌టుడే

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస దూరం కలిగిన చిరునామాకు ఎల్పీజీ సిలిండర్లను చేర్చినందుకు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవరసరం లేదు. అయితే కార్మికుల శ్రమ దృష్ట్యా వినియోగదారులు సిలిండర్‌ ధరకు అదనంగా చెల్లించే విషయంలో ఔదార్యంతో వ్యవహరించడం నిర్వాహకులకు వరంగా మారింది. ఈ మొత్తం ఏడాదికి రూ.కోట్లలో ఉండటం విస్మయం కలిగించే స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో జిల్లాలోని సిలిండర్ల సరఫరా పరిస్థితులు ఇవీ...

పంపిణీ కేంద్రాలు 22... కనెక్షన్లు 3.39 లక్షలు

జిల్లాలో మొత్తం ఎల్పీజీ గ్యాసు సిలిండర్ల పంపిణీ కేంద్రాలు 22 ఉండగా, వీటి పరిధిలో మొత్తం 3,39,715 కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహావసరాలకు సంబధించినవి 81 వేల వరకు, ఉజ్వల పథకంలో 41 వేలు, దీపం పథకం కింద 55 వేలు, అత్యధికంగా చిన్న సిలిండర్ల కనెక్షన్లు 1.61 లక్షలు ఉన్నాయి. కాగా జిల్లా కేంద్రం జగిత్యాలలో 24 వేల కుటుంబాలు ఉండగా, మొత్తం 4 పంపిణీ కేంద్రాల్లో కలిపి గృహావసరాలవి 22 వేల వరకు, కోరుట్లలో 3 కేంద్రాల్లో కలిపి 17 వేల వరకు, తక్కిన పట్టణాలు, మండలాల్లో వెయ్యి నుంచి 8 వేల వరకు గృహావసరాల కనెక్షన్లు ఉన్నాయి.

అదనం.. రవాణా భారం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపిణీ కేంద్రం పరిధిలోని వినియోగదారులకు గోదాము నుంచి సరఫరా చేసేందుకు ఎలాంటి రవాణా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. గోదాం పరిధి దాటి 30 కిలోమీటర్ల లోపు నివాస స్థలం ఉన్నట్లయితే రూ.10, అంతకు మించి దూరం ఉంటే రూ.15 వరకు రవాణా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లా మొత్తంగా పరిశీలిస్తే సిలిండర్‌ ధరకు అదనంగా రూ.20 నుంచి రూ.25 వరకు చెల్లిస్తున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.

నాలుగు పట్టణాల్లోనే 2 లక్షల కనెక్షన్లు

జిల్లాలో జనాభా ఎక్కువగా ఉన్న 4 పట్టణాల్లో కలిపి మొత్తం 2 లక్షల మంది వరకు వినియోగదారులు ఉన్నారు. జగిత్యాలలో నాలుగు కేంద్రాల్లో కలిపి 68 వేలకు పైగా కోరుట్లలో 76 వేల వరకు, ధర్మపురిలో 35 వేలు, మల్యాలలో 20 వేల వరకు కనెక్షన్లు ఉన్నాయి.

క్రమంగా పెరిగిన ధర

జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గృహావసరాల సిలిండరు ధర ప్రస్తుతం రూ.972 ఉంది. ఏడాది క్రితం రూ.600 వరకు ఉన్న ధర కాస్తా, క్రమంగా రూ.972 వరకు చేరుకుంది. గత ఆగస్టులో రూ.932 ఉండగా, సెప్టెంరులో రూ.957, ప్రస్తుతం రూ.972కి పెరగగా, గతేడాదితో పోలిస్తే 370 వరకు పెరగడం మధ్య, పేద తరగతి వర్గాలకు కొంత భారంగా పరణమించింది.

పౌర సరఫరాశాఖ ఏం చేస్తున్నట్లు?

పంపిణీదారులు అధిక ధరలు తీసుకుంటున్నప్పటికీ పౌరసరఫరాల అధికారులు ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదు. రవాణా పేరిట అదనంగా కొంత చెల్లించడం గతం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కాగా ఇటీవల సిలిండరు ధర పెరగడం, దీనికి అదనంగా రవాణా ఛార్జీ తోడవడం సామాన్యులకు మరింత భారంగా మారింది. తరచూ తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రోజుకు రూ.లక్ష..

సభ్యులు ఎక్కువగా ఉండి వినియోగం పెరిగిన కుటుంబాలు నెలకు ఒక సిలిండరు, కొన్ని కుటుంబాలు రెండు, మూడు నెలలకు ఒక సిలిండరు చొప్పున వినియోగిస్తున్నారు. వీటికి అదనంగా వ్యాపార కనెక్షన్లు నెలకు 2కు పైగా సిలిండర్లు వాడే వారు సైతం వందల సంఖ్యలో ఉన్నారు. మొత్తంగా  అన్ని ఏజెన్సీలు కలిపి 4 వేల నుంచి 5 వేల వరకు సిలిండర్లను వినియోగదారుల చిరునామాకు చేరవేస్తున్నారు. నివాసం, వ్యాపార కేంద్రాలకు సరఫరా చేసినందుకు సిలిండర్‌ ధరకు అదనంగా రవాణా ఛార్జీ పేరిట రూ.20 నుంచి రూ. 25 వరకు చెల్లిస్తున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన సిలిండర్‌ రవాణకు రూ.20 అనుకున్నా, రోజుకు రూ.లక్ష చొప్పున నెలకు రూ.30 లక్షల వరకు, ఏడాది రూ.3 కోట్ల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

నిబంధనల మేరకే చెల్లించాలి - చందన్‌కుమార్‌, జిల్లా పౌరసరఫరా అధికారి

వినియోగదారులు రసీˆదులో పేర్కొన్న ధర మేరకు డబ్బులు చెల్లించాలి. అదనపు వసూళ్ల విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఏజెన్సీల నిర్వాహకులకు సైతం సూచించాం. అదనంగా వసూలు చేసిన ఏజెన్సీల సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు.

జిల్లాలో ఏజెన్సీల సంఖ్య    22
రోజుకు సగటున సరఫరా   5 వేలు
ప్రస్తుతం సిలిండర్‌ ధర   రూ.972
నెలకు అదనపు వసూళ్లు  రూ.30 లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని