logo

రైతుల పక్షాన ఉద్యమిస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనంగా మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, వాస్తవంగా మూడో టీఎంసీకి ఎలాంటి అనుమతి లేదని.. ఈ విషయంలో కేంద్ర జలవనరుల శాఖ జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు.

Updated : 28 Jan 2022 05:21 IST

సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

సుభాష్‌నగర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనంగా మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, వాస్తవంగా మూడో టీఎంసీకి ఎలాంటి అనుమతి లేదని.. ఈ విషయంలో కేంద్ర జలవనరుల శాఖ జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో టీఎంసీకి అనుమతి లేదని కేంద్ర జలశక్తి మంత్రి సీఎం కేసీఆర్‌కు గతేడాది డిసెంబర్‌ 11న లేఖ రాశారని వివరించారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సైతం అభ్యంతరం చెప్పగా ఇక్కడి జిల్లా అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రామడుగు, గంగాధర, వెల్గటూర్‌, బోయినపల్లి మండలాల్లో భూసేకరణ చేస్తుంటే ఎంపీ బండి సంజయ్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల భూములు లాక్కుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. అదనపు నిర్మాణ పనులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎంపీ బండి సంజయ్‌ ప్రకటనలకే పరిమితం కాకుండా ఈనెల 31నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశంలో 3వ టీఎంసీ నిర్మాణ పనులపై ప్రస్తావించాలన్నారు. రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని... రాజకీయాలతీతంగా ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, తెపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.పద్మాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని