logo

మండే ఎండల్లో గిరగిరా మీటర్లు

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్ల వాడుతుండటంతో మీటర్లు

Published : 20 May 2022 03:47 IST

జిల్లాలో పెరుగుతున్న విద్యుత్తు వినియోగం

ప్రాధాన్య రంగాలకు గణనీయంగా డిమాండ్‌

ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్ల వాడుతుండటంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాకు విద్యుత్తు శాఖ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవనున్నాయన్న వాతావరణ సూచనలతో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ విద్యుత్తుకు డిమాండ్‌ అధికంగా ఉండనుంది. కొత్త కనెక్షన్లు కూడా పెరగనున్నాయి. ఈ క్రమంలో వచ్చే సీజన్‌కు అనుగుణంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అంతరాయం లేకుండా అందించేలా శాఖాపరమైన చర్యలు చేపట్టారు. కొత్త కనెక్షన్ల మంజూరులో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

భారీగా పెరిగిన కనెక్షన్లు 

జిల్లావ్యాప్తంగా 30 వేల వ్యవసాయ బావులుండగా, బోరుబావులతో కలిపి 2 లక్షలకు పైగా మోటార్లున్నాయి. 24 గంటల విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో ఏటికేడు కొత్త కనెక్షన్ల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. 2020లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 368 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 2021 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 402 కొత్త కనెక్షన్లు మంజూరు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 300 మంజూరు చేశారు. జూన్, జులై, ఆగస్టు నెలాఖరు వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యరంగాల వారీగా విద్యుత్తు కనెక్షన్లు కూడా గణనీయంగా పెరిగాయి. మార్చిలో మొత్తం కనెక్షన్లు 3,21,735 ఉండగా ఏప్రిల్‌లో 3,22,571కు పెరిగాయి. అంటే నెల రోజుల్లో 836 కనెక్షన్లు పెరిగాయి. ఇక మే నెలలో 18వ తేదీ వరకే 3,23,181 కనెక్షన్లకు పెరిగాయి. అంటే 610 కనెక్షన్లు అధికంగా చేరాయి.

డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా

* గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మే వరకు మొత్తం 211.59 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు అందుబాటులో ఉండగా 345.28 మిలియన్‌ యూనిట్లు వినియోగమయ్యాయి. అంటే 133.69 మిలియన్‌ యూనిట్లు అదనంగా అవసరమయ్యాయి.

* ఈ ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటివరకు 492.6 మిలియన్‌ యూనిట్లు అందుబాటులో ఉండగా ఇప్పటికే 478.6 మి.యూ. వాడకం జరగగా నెలాఖరు వరకు రెట్టింపు వినియోగం కానుంది. 

* ఈ ఏడాది మార్చిలో లక్షిత డిమాండ్‌ 219.4 మిలియన్‌ యూనిట్లు కాగా, 204.82 మిలియన్‌ యూనిట్ల వాడకం జరిగింది. 

* ఏప్రిల్‌లో 171.6 మి.యూ.డిమాండ్‌ ఉంటే 175.06 మి.యూ. వినియోగం జరిగింది. 4 మిలియన్‌ యూనిట్లు ఎక్కువగా వినియోగమైంది. 

* ఇక మే నెలలో 101.68 మిలియన్‌ యూనిట్ల లక్ష్యం ఉండగా ఇప్పటికే 98.02 మిలియన్‌ యూనిట్ల వాడకం పూర్తయింది. నెలాఖరు వరకు లక్ష్యానికి కంటే రెట్టింపు వినియోగించే అవకాశాలున్నాయి. 

* వచ్చే వానాకాలంలో జిల్లాలో మొత్తం 2,86,755 ఎకరాల్లో పంటలు సాగు చేయనుండగా ఇందులో వరి 1,93,200 ఎకరాల్లో వేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు.

సమస్యల సత్వర పరిష్కారం: బొంకూరి సుదర్శన్, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ

ప్రస్తుతం వ్యవసాయ, ఇతర ప్రాధాన్య రంగాలకు 24 గంటల పాటు ఆటంకాలు లేకుండా విద్యుత్తు అందిస్తున్నాం. వచ్చే వానాకాలం సీజన్‌లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. అడిగిన వెంటనే నిబంధనల ప్రకారం కొత్త కనెక్షన్లు ఇస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు వచ్చినా స్థానిక కార్యాలయాల్లో సంప్రదిస్తే వెంటనే పరిష్కరిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని