logo

తొలగని అడ్డంకులు

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిధిలో నగర రూపు రేఖలు మార్చేలా మూడేళ్ల కిందట ప్రారంభించిన అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మహా నగరాల తరహాలో నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు

Published : 24 May 2022 04:30 IST

పూర్తి కాని మొదటి విడత పనులు
తుది రూపం ఇస్తే స్మార్ట్‌ నగరం

మంకమ్మతోట నుంచి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రోడ్డును నిర్మించి టైల్స్‌, రెయిలింగ్‌ పనులు పూర్తి చేయగా మధ్యలో డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు అడ్డు రావడంతో అక్కడే       పనులు ఆగాయి.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిధిలో నగర రూపు రేఖలు మార్చేలా మూడేళ్ల కిందట ప్రారంభించిన అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మహా నగరాల తరహాలో నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు పాత 50 డివిజన్లలో 31డివిజన్లు ఎంపిక చేసి మొదటి ప్రాధాన్యం కింద రహదారులు, డ్రైనేజీలు, సైకిల్‌, వాకింగ్‌ట్రాక్‌, మొక్కల పెంపకం, పార్కులు, కూడళ్ల సుందరీకరణ పనులు చేస్తున్నారు. వీటిలో ఒకటెండ్రు పూర్తి కాగా మిగతావి పూర్తి చేయాల్సి ఉంది.

పొడిగింపులకే మొగ్గు

ఆకర్షణీయ పనులు చేపట్టేందుకు ఏజెన్సీలకు పలుమార్లు గడువు విధించారు. అయినప్పటికీ ఆలస్యం చేయడంతో ఆరు నెలలకు ఒకసారి పొడిగించేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. పర్యవేక్షణ చేసే కన్సల్టెన్సీ బృందం ఈ పనులను క్షేత్రస్థాయిలో చూస్తుండగా..వేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ మాత్రం తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరపాలక ఇంజినీర్లు మాత్రం అడ్డంకులు లేకుండా ఈ పనులు పూర్తి చేసేలా తనిఖీలు మాత్రం చేయడం లేదు.

అన్నీ చోట్ల అసంపూర్తి..

నగరంలో 34కిమీ పొడువునా 84 పైగా రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కటీ రోడ్డు కూడా పూర్తి కాలేదు. ఏ రోడ్డులో చూసినా ఏదో ఒకటి అడ్డంకులతో పనులు నిలిచిపోయి ఉన్నాయి. 30ఫీట్ల నుంచి 60ఫీట్ల రహదారులపై వైపు ఈ పనులు ప్రారంభించగా పలుచోట్ల సమస్యలు ఆ ప్రాంతవాసులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. తవ్వి వదిలేయడం, విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు తొలగించకపోవడం, విస్తరణ పనులు సకాలంలో పరిష్కరించకపోవడంతో నెలల తరబడి నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, చిన్న కారణాలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్లితే ఆ పనుల్లో తుది రూపం వచ్చి నగరం మరింత ఆకర్షణీయంగా మారనుంది.

అంబేడ్కర్‌స్టేడియంలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులకు రూ.కోట్లు కేటాయించారు. గత మూడేళ్లుగా కొనసాగుతుండగా ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. రంగులతో పాటు లోపలి పనులు మిగిలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.


కొన్ని చోట్ల సమస్యలు ఇలా..

* విద్యానగర్‌లో రెండు చోట్ల డ్రైనేజీ నిర్మాణ పనులు ఆగిపోయాయి.

* ప్రభుత్వాసుపత్రి వెనుకాల మురుగు కాల్వల పనులు చేయకుండా వదిలేశారు.

* మంకమ్మతోటలోని ఎస్టీ కాలనీ వైపు అప్రోచ్‌ రహదారి నిర్మించకుండా వదిలేశారు.

* టూటౌన్‌ ఎదురుగా నుంచి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రోడ్డులో రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు అడ్డుగా ఉన్నాయి.

* కశ్మీర్‌గడ్డ- గోదాంగడ్డ రోడ్డులో నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన మట్టి కుప్పలు అలాగే పడి ఉన్నాయి.

* భగత్‌నగర్‌ నుంచి కలెక్టరేట్‌ వచ్చే దారిలో రహదారికి ఇరువైపులా టైల్స్‌ వేయాల్సి ఉంది.

* జడ్పీ క్వార్టర్స్‌ పక్క నుంచి భగత్‌నగర్‌ వైపు వెళ్లు దారి మధ్యలో ట్యాంకు తొలగించగా ఆ కొంతభాగం, వాల్వు మరమ్మతులు చేసిన చోట పనులు పూర్తి చేయలేదు.

* రాజీవ్‌చౌక్‌ నుంచి పాత శిశుమందిర్‌ వరకు రహదారి విస్తరణ చేయకపోవడంతో సీసీ రోడ్డు పనులు ఆగిపోయాయి.

* కట్టరాంపూర్‌లో పలు చోట్ల విస్తరణ పనుల్లో జాప్యం వస్తుండగా తవ్వి వదిలేయడంతో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
* హౌసింగ్‌బోర్డుకాలనీలో స్మార్ట్‌ పనుల్లో పురోగతి లేకపోగా, అక్కడ చేస్తున్న పనులు ఆకట్టుకోవడం లేదు.

నగరంలోని పది ప్రాంతాల్లో స్మార్ట్‌ బిన్స్‌ ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించగా ఆ పనులు పూర్తయినట్లుగా ప్రకటించారు. ఎక్కడ కూడా అవి ఉపయోగంలోకి రావడం లేదు. దీనికి ప్రధాన వాహనమే ఇప్పటికీ రాకపోవడంతో అవి ఇలా అధ్వానంగా తయారయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని