logo

అక్షర చైతన్యం.. సమగ్ర వికాసం

కరవు చీకట్ల నుంచి వెలుగు వాకిట్ల దాకా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రస్థానం ప్రగతి పంథాలో  సాగుతోంది.  స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ.. అన్ని రంగాల్లో అభివృద్ధిని అక్కున చేర్చుకుంటోంది. పల్లె వాకిట్లో కనిపిస్తున్న మార్పులకు తోడుగా.. పట్టణ వీధుల్లోనూ అసలైన వికాసం దరిచేరుతోంది.  అక్షర చైతన్యం అండగా నిలబడుతూ ఉజ్వల భవితకు వారధి వేస్తోంది. పాలనా సౌలభ్యం కోసం జరుగుతున్న వికేంద్రీకరణ  ఫలాల్ని అందిస్తోంది.  

Published : 11 Aug 2022 06:28 IST

అన్ని రంగాల్లో అనూహ్య మార్పులు

ఈనాడు, కరీంనగర్‌

కరవు చీకట్ల నుంచి వెలుగు వాకిట్ల దాకా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రస్థానం ప్రగతి పంథాలో  సాగుతోంది.  స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ.. అన్ని రంగాల్లో అభివృద్ధిని అక్కున చేర్చుకుంటోంది. పల్లె వాకిట్లో కనిపిస్తున్న మార్పులకు తోడుగా.. పట్టణ వీధుల్లోనూ అసలైన వికాసం దరిచేరుతోంది.  అక్షర చైతన్యం అండగా నిలబడుతూ ఉజ్వల భవితకు వారధి వేస్తోంది. పాలనా సౌలభ్యం కోసం జరుగుతున్న వికేంద్రీకరణ  ఫలాల్ని అందిస్తోంది.  ప్రజల మనుగడకు అవసరమైన మార్పు, కూర్పుల మేళవింపుతో పురోగతి ముందడుగేస్తోంది. అంచెలంచెలుగా నాలుగు జిల్లాల ఖ్యాతి వృద్ధిపథాన పయనిస్తోంది. వజ్రోత్సవ తరుణాన స్వాతంత్య్రం కోసం పోరు సల్పిన నాటి పరిస్థితులు.. నేటి పరిస్థితుల్లో కనిపిస్తున్న మార్పుల సమహారమిలా..

1947 స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హైద్రాబాద్‌ రాష్ట్రం పరిధిలో 8 తహసీల్‌ ప్రాంతాలతో ఏర్పాటై ఉంది. కరీంనగర్‌, సిరిసిల్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సుల్తానాబాద్‌, మంథని, పరకాల, హుజూరాబాద్‌ తహసీల్‌ల పరిధి నుంచే పరిపాలన అందేది. 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కరీంనగర్‌ పూర్వ జిల్లా నాలుగు జిల్లాలుగా రూపం మార్చుకుంది. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి కొత్త జిల్లాలుగా ఏర్పడగా.. పాత జిల్లాగా ఉన్న కరీంనగర్‌ తన పరిధిని తగ్గించుకుంది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాలుగు జిల్లాలు 61 మండలాలతో పాలనా సౌలభ్యాన్ని పెంచుకుంది.

అక్షరోద్యమమే నాందిగా..
నిరంకుశ పాలనలో నలిగిపోతున్న ప్రజలను మేల్కొల్పాలనే ఉద్దేశంతో స్వాతంత్య్ర పోరాట సమయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చేపట్టిన గ్రంథాలయోద్యమం మంచి ఫలితాల్ని అందించింది. ప్రజలను పోరుబాట పట్టించేందుకు అక్షరోద్యమమే ఆయుధంగా మారింది. గ్రామాల్లో నిరక్షరాస్యులైన ప్రజలను అక్షరాస్యులుగా మార్చేందుకు రాత్రి పాఠశాలలు, గ్రామ గ్రంథాలయాల పేరిట చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమంతో ప్రజలు చైతన్యులయ్యారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రపథమంగా 1922 ఏప్రిల్‌ 22న తహసీల్‌లో పనిచేస్తున్న బసవేశ్వరరావు, సర్వభట్ల వెంకటరామారావుల చొరవతో విశ్వేశ్వర భాషానిలయం పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దామెర్ల నరహరి ఇక్కడ భాండాగారి(లైబ్రేరియన్‌)గా పనిచేశారు. 1923లో మంథని, కరీంనగర్‌, జగిత్యాల, సుల్తానాబాద్‌లలో ఒక్కోటి చొప్పున ఏర్పాటయ్యాయి. 1925లో సిరిసిల్లలో, 1926లో కోరుట్లలో ఇవి పుట్టుకొచ్చాయి. తరువాత గ్రామీణ ప్రాంతాలైన రుద్రంగి, జమ్మికుంట, పెద్దపల్లి, బెజ్జంకి, ధర్మపురి, నెమలికొండ, కొడిమ్యాలలో చదువునేర్పే ఆలయాలుగా గ్రంథాలయాలు దోహదపడ్డాయి.


అప్పట్లో కరీంనగర్‌ జిల్లా స్వరూపమిలా..

20 లక్షలకు చేరువగా..
1941 సంవత్సరం నుంచి 2011 జనాభా లెక్కల వరకు అనూహ్యంగా జిల్లాలో జనాభా వృద్ధి చెందింది. 1941లో 13,70,045 మంది ఉండగా.. 2011 నాటికి 33,38,497కు సంఖ్య పెరిగింది. దాదాపుగా 20లక్షలకు చేరువగా(19,68,452) వృద్ధి కనిపించింది. కరీంనగర్‌ జిల్లాలో 1941 నుంచి 1951 మధ్య దశాబ్దకాలంలో 15.4 శాతం జనాభా పెరగగా.. గడిచిన ఏడు దశాబ్దాలుగా దాదాపుగా రెండింతలను దాటేలా పురోగతి అగుపిస్తోంది. ప్రస్తుత సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే వీలుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా జనాలు పుట్టుకొచ్చారు.

విద్యా ఉషస్సు
* అక్షరాస్యత పరంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అనూహ్య మార్పులు దరిచేరాయి. 1951 జనాభా లెక్కల ప్రకారం ఆరేళ్లలోపు పిల్లలను మినహాయిస్తే దాదాపు 10శాతం లోపు అక్షరాస్యత ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 64.42శాతం చదువుకున్నవారున్నారు.
* అప్పట్లో 136 మంది మగవారు, 23 మంది మహిళలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా.. ఇప్పుడు దాదాపుగా నాలుగు జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ వృత్తిలో పోటాపోటీ అనేలా మహిళలు, పురుషుల భాగస్వామ్యం కనిపిస్తోంది. 10,850 మంది ప్రస్తుతమున్నారు.
* స్వాతంత్య్రం కోసం పోరాటం జరిగే సమయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  44 మంది మగవాళ్లే ఇంజినీర్లుగా ఉండగా.. ఇప్పుడు ఏటా ఇంజినీరింగ్‌ విద్యలో 2-3వేల మంది పట్టాను అందుకుంటున్నారు.
* నాడు మిడిల్‌ స్కూల్‌ చదివిన వారు 4,264 మంది పురుషులు, 446 మంది స్త్రీలున్నారు. మెట్రిక్యులేట్‌(ఎస్‌ఎల్‌సీ) హైయ్యర్‌ సెకండరీ చదివినవారు 11,431 మంది మగవారు, 43 మంది మహిళలున్నారు. 183 మంది ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసించారు.
* గ్రాడ్యుయేషన్‌ చేసినవాళ్లు 129 మంది  పురుషులుంటే అందులో కేవలం ఐదుగురు మహిళలున్నారు. పీజీ చేసివానవారు 17 మంది ఉంటే ఒక్కరంటే ఒక్క అతివ ఈ ఘనతను అందుకుంది. న్యాయవాద వృత్తిలో 82 మంది  పురుషులు సేవల్ని అందించారు.
* వైద్య వృత్తిలో 47 మంది వైద్యులు ఉండగా.. మరో ఆరుగురు అతివలు వైద్యవృత్తిలో రాణిస్తూ సేవలందించేవారు. ఇతర వృత్తుల్లో 506 మంది పురుషులు, మరో 37 మంది స్త్రీలు మాత్రమే ఉద్యోగ బాధ్యతలతో అప్పట్లో కుటుంబాలకు ఆసరాగా నిలిచారు.
* ప్రస్తుతం ఈ విద్యావిధానంలో వచ్చిన మార్పులకనుగుణంగా ఉమ్మడి జిల్లాలో విద్యఅందరి హక్కుగా మారడంతో విదేశాల్లోనూ అత్యున్నత డిగ్రీలను చదువుతూ.. ఆదర్శమనేలా అన్నిరంగాల్లో అవకాశాల్ని వేలాది మంది అందుకుంటున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని