logo

Super Star Krishna: జిల్లా యాదిలో సూపర్‌స్టార్‌

‘ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ..’ ‘తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా’తదితర పాటలతో అలరించిన సూపర్‌స్టార్‌ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ధ్రువతారగా ఎదిగారు.

Updated : 16 Nov 2022 10:22 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

‘ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేళ..’ ‘తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా’తదితర పాటలతో అలరించిన సూపర్‌స్టార్‌ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ధ్రువతారగా ఎదిగారు. దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో ఉండి  ప్రజలను అలరించారు. ఆ మహా నటుడికి  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో ఆత్మీయానుబంధం ఉంది. ఆయన ఈ లోకాన్ని వీడిపోవడంతో సినీ అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషుల్లో విషాదం నెలకొంది. ఆయన చిత్రాలు..పాటలు, రాజకీయ కార్యక్రమాలను స్మరించుకుంటూ జిల్లావాసులు నివాళులర్పించారు.  

స్థానిక దర్శకులతో కలిసి పని చేసి..

కొత్తపల్లికి చెందిన కె.కె.రెడ్డి బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. కృష్ణ కె.కె.రెడ్డితో కలిసి సుదీర్ఘంగా కలిసి ఉన్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలు తీసేందుకు కె.కె.రెడ్డితోపాటు తొలిముద్దు చిత్ర దర్శకుడు రుష్యేందర్‌రెడ్డితో ఆత్మీయ అనుబంధం పెంచుకున్నారు. మెట్పల్లి ప్రచారంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో కె.కె.రెడ్డి ఇంట్లో, అతని సోదరుడు రాంరెడ్డి ఇంట్లో భోజనం చేసి స్థానికులతో మాట్లాడినట్లు రుష్యేందర్‌రెడ్డి తెలిపారు. ‘మేరి అవాజ్‌ సునో’, తదితర చిత్రాలతోపాటు కృష్ణతో ‘నా ఇల్లే..నా స్వర్గం’ చిత్రం తీశారని రుష్యేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పద్మాలయ స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కృష్ణతో చిత్ర పరిశ్రమ ఒక యుగం ముగిసిందన్నారు.

పలువురి సంతాపం..

సినీ నటుడు కృష్ణ మృతిపై సాహితీకారులు, కళాకారులు సంతాపం ప్రకటించారు. సమైక్య సాహితీ అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్‌, కఫిసో అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, లక్ష్మీగౌతమ్‌, సినీ విమర్శకులు వారాల ఆనంద్‌, మాస్క్‌ ఫిలిం యాక్టింగ్‌ స్కూల్‌ అనసూరి భూనాథాచారి, చిరంజీవి రాష్ట్ర యువత ఉపాధ్యక్షుడు మిడిదొడ్డి నవీన్‌కుమార్‌ సంతాపం తెలిపారు.


సంభవం చిత్రీకరణకు 18 రోజులు జిల్లాలో..

కరీంనగర్‌కు చెందిన పి.రామ్మోహన్‌రావు నిర్మాతగా సినీ హీరో కృష్ణతో 1998లో సంభవం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం 18 రోజులు జిల్లాలోనే ఉన్నారు. కమాన్‌ చౌరస్తా, కోర్టు చౌరస్తా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద కొన్ని దృశ్యాలతోపాటు ఒక పాట చిత్రీకరించారు. ఆ రోజుల్లో ఈ చిత్ర షూటింగ్‌తోపాటు సినీ నటులను చూసేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలివచ్చారు. కృష్ణతోపాటు సుమన్‌, రోజా, అలీ, శ్రీహరిలాంటి నటులు ఇక్కడే ఉండి షూటింగ్‌లో పాల్గొన్నారని నిర్మాత రామ్మోహన్‌రావు తెలిపారు. నాలుగేళ్ల కిందట తన కూతురు వివాహానికి కృష్ణ హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో కృష్ణలాంటి వ్యక్తిత్వం, మంచితనం అందరి అభిమానం చూరగొన్న వ్యక్తి అని పేర్కొన్నారు. 1997లో సొంత బ్యానర్‌లో దర్శకుడు ఎన్‌.శంకర్‌తో తీసిన ఎన్‌కౌంటర్‌ సినిమా విజయోత్సవానికి శ్రీనివాస థియేటర్‌కు వచ్చారు.


మెట్‌పల్లితో అనుబంధం

సూపర్‌స్టార్‌ కృష్ణ మరణంతో మెట్‌పల్లి ప్రాంత అభిమానుల్లో విషాదం నెలకొంది. మెట్‌పల్లితో ఆయనకున్న అనుబంధాన్ని కాంగ్రెస్‌ నాయకులు గుర్తు చేసుకున్నారు. మెట్పల్లిలో 1998లో జరిగిన ఉప ఎన్నికలో కృష్ణ కాంగ్రెస్‌ అభ్యర్థి కొమిరెడ్డి జ్యోతిదేవి తరఫున ప్రచారం చేశారు. 

 -న్యూస్‌టుడే, మెట్‌పల్లి


అభిమానులకు ప్రాధాన్యం

1991లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణ మంథనికి వచ్చారు. పెద్దపల్లి నుంచి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటస్వామికి మద్దతుగా సతీమణి విజయనిర్మలతో కలిసి కృష్ణ వచ్చారు. కళాశాల మైదానంలో జరిగిన సభలో అభిమాన సంఘాల నాయకులతో కలిసి ఫొటోలు దిగారు. కృష్ణ సేన అధ్యక్షుడు కొమురోజు శ్రీనివాస్‌, ప్రస్తుత మున్సిలర్‌ కౌన్సిలర్‌ వి.కె.రవి ఆయనకు రక్త తిలకం దిద్ది అభిమానం చాటుకున్నారు.

-న్యూస్‌టుడే, మంథని గ్రామీణం


సతీమణితో కలిసి కాకాకు మద్దతుగా..

1991 పార్లమెంట్‌ ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జి.వెంకటస్వామి తరపున హుజూరాబాద్‌లో ప్రచార సభకు సినీనటులు కృష్ణ, విజయనిర్మల హాజరయ్యారు.

-న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ గ్రామీణం


ప్రచారంలో భాగంగా..

1989 శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డికి మద్దతుగా నటుడు కృష్ణ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సతీమణి విజయనిర్మల కూడా కృష్ణ వెంట పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, పెద్దపల్లి


నాటి క్షణాలు గుర్తు చేసుకుంటూ.

* తిమ్మాపూర్‌కు చెందిన నటుడు కేతిరెడ్డి మల్లారెడ్డి సూపర్‌ స్టార్‌తో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. మంచి మనసున్న కృష్ణ దూరమవడం పరిశ్రమకు తీరని లోటన్నారు. ‘గండికోట రహస్యం’లో ప్రధాన విలన్‌ పాత్రలో నటించానన్నారు. అలాగే కృష్ణ సొంత బ్యానర్‌ అన్నయ్య సీరియల్‌లో ఇన్‌స్పెక్టర్‌గా నటించానన్నారు.

* చెన్నైలో ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్ర షూటింగ్‌ సమయంలో కృష్ణతో కలిసి మాట్లాడానని పొట్టి శ్రీరాములు ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల రామేశం గుర్తు చేసుకున్నారు.

* పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ అవార్డులు వచ్చిన సందర్భంగా జిల్లా ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్‌గౌడ్‌, పీచర కృష్ణమాచార్యులు పలుమార్లు కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని