logo

నిర్వహణ బరువు.. స్వచ్ఛత కరవు

జిల్లాలోని కొన్ని సర్కారు బడుల్లో మూత్రశాలలు, మరుగు దొడ్ల సౌకర్యం కొరవడింది. ప్రత్యామ్నాయం లేక ఒంటికి, రెంటికొస్తే విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి.

Published : 04 Dec 2022 06:07 IST

న్యూస్‌టుడే, మెట్‌పల్లి

జిల్లాలోని కొన్ని సర్కారు బడుల్లో మూత్రశాలలు, మరుగు దొడ్ల సౌకర్యం కొరవడింది. ప్రత్యామ్నాయం లేక ఒంటికి, రెంటికొస్తే విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించినా నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో నిధుల కొరతతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోగా మరికొన్నిచోట్ల నీటి వసతి లేకపోవడంతో అపరిశుభ్రత నెలకొంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 783 ఉండగా 57,511 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో బాలురు 29,902 మంది, బాలికలు 27,609 మంది ఉన్నారు.

ఆదేశాలు కాగితాలకే పరిమితం..

పాఠశాలల పరిశుభ్రత బాధ్యతను గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో పురపాలక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ సమయంలో కొద్ది రోజుల పాటు పంచాయతీ, పుర కార్మికులు పాఠశాలలను శుభ్రం చేసి వదిలారు. రెండేళ్లుగా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 7.30 నుంచి సాయంత్రం పాఠశాల సమయం ముగిసే వరకు విధుల్లో ఉండేవారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రం చేయడంతో పాటు పిల్లలకు తాగునీరు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం పారిశుద్ధ్య సిబ్బంది లేక పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రంగా మారాయి. పలు బడుల్లో తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులే పారిశుద్ధ్య కార్మికులుగా మారాల్సిన దుస్థితి. పంచాయతీ, పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమతమయ్యాయి. పురపాలికలు, పాఠశాలల్లో వసతులు, నిర్వహణకు పంచాయతీలు పురపాలక సంఘాలకు విడుదలయ్యే 14, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత వినియోగించుకోవాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేసినా పంచాయతీ అధికారులు స్పందించడం లేదు.


ఈ చిత్రంలోని మరుగుదొడ్లు మల్లాపూర్‌ మండలంలోని ఓ పాఠశాలకు చెందినవి. ఇవి శిథిలావస్థకు చేరడంతో పాటు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి. ఆరు బయటకు లేదా ఇళ్లకు వెళ్తున్నారు. ఇక్కడ 50కి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.


ఇవి మెట్పల్లి పట్టణంలోని ప్రాథమిక పాఠశాల మరుగుదొడ్లు. ఇక్కడ 46 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరుగుదొడ్లు ఉన్నా వాటికి తలుపులు లేవు. ఒంటికి, రెంటికి ఖాళీ స్థలానికి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల ఆవరణంతా పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగాయి. చెరువు సమీపంలో పాఠశాల ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.


నిధులు కేటాయించాలి

- తులసి ఆగమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, యూటీఎఫ్‌

ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నాయి. నిర్వహణ లోపంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు పాఠశాలల్లో నీటి సమస్యతోపాటు మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పురపాలక, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించినా పాఠశాలల వైపు చూడడంలేదు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలి. ప్రతి పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలి.


పంచాయతీ, పుర కార్మికులకు పారిశుద్ధ్య బాధ్యత

- జగన్మోహన్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, జగిత్యాల

పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీ, పురపాలికలకు అప్పగించింది. పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించాల్సి ఉన్నా అలా జరగడం లేదు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరగా మరికొన్నింటిలో నీరు, విద్యుత్తు సమస్యలు ఉన్నాయి. శిథిలావస్థకు చెందిన మరుగుదొడ్ల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని