logo

అతివల సాధికారతకు అడ్డంకులు!

స్వశక్తి సంఘ సభ్యుల జీవనోపాదుల కల్పన పథకంలో భాగంగా ఒకప్పుడు అమలు చేసిన పలు రకాల అనుబంధ సంక్షేమ పథకాలు రద్దు కావడం మహిళలను నిరాశకు గురి చేస్తోంది.

Published : 01 Feb 2023 04:53 IST

సమావేశంలో పాల్గొన్న మహిళలు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: స్వశక్తి సంఘ సభ్యుల జీవనోపాదుల కల్పన పథకంలో భాగంగా ఒకప్పుడు అమలు చేసిన పలు రకాల అనుబంధ సంక్షేమ పథకాలు రద్దు కావడం మహిళలను నిరాశకు గురి చేస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళ సంఘాల్లో సభ్యురాలిగా ఉండాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు.

అటకెక్కిన అనుబంధ పథకాలు

మహిళల సంఘాల కుటుంబాల కనీస అవసరాలు తీర్చేందుకు అనుబంధ సంక్షేమ పథకాలను అమలు చేశారు. దాదాపుగా 30 ఏళ్లుగా అనుబంధ సంక్షేమ పథకాలతో మహిళలు లబ్ధిపొందారు.

* సంఘాల్లో సభ్యులుగా చేరిన ప్రతీ మహిళకు పింఛన్‌ సౌకర్యం కల్పించేందుకు ఆభయహస్తం ప్రవేశ పెట్టారు. ఒకే సారి రూ.380 చెల్లిస్తే 65 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.500 పింఛన్‌ మంజూరు చేశారు. దాదాపుగా ఎనిమిదేళ్లుగా ఈ పథకం నిలిచింది.

* ప్రసూతి మరణాలు తగ్గించి బాలికల జనన శాతాన్ని పెంచేందుకు అమలైన ‘బంగారు తల్లి’ పేదంటి మహిళలకు ఆర్థికంగా నిలిచింది. గర్భం దాల్చిన నుంచి ప్రసూతి జరిగే నెలకు రూ.వెయ్యి ఇచ్చారు. ఆడబిడ్డ పుడితే రూ.2,500, ఐదేళ్ల నిండిన తర్వాత రూ.1,500, ఇంటర్మీడియట్‌ వరకు ఏడాదికి రూ.3,500 చెల్లించారు. వేలాది మందికి లబ్ధి చేకూరింది.

* ఆమ్‌ ఆద్మీబీమా పథకానికి ధీమా లేకుండా పోయింది. ఈ పథకంలో ఏడాదికి రూ.వెయ్యి చెల్లిస్తే కుటుంబంలో సాధారణంగా మరణిస్తే రూ.25 వేలు, ప్రమాదంలో మృతిచెందితే రూ.75 వేలు బీమా చెల్లించారు. జనశ్రీ బీమా యోజనలోనూ సాధారణ మరణానికి రూ.25 వేలు, ప్రమాదంలో మృతిచెందితే రూ.75 వేలు మంజూరు చేశారు.

* ఈ మూడు రకాల పథకాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక మహిళ కుటుంబాల్లోని పిల్లలకు ఉపకార వేతనాలు పొందారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత చదువులకు ఉపయుక్తంగా ఉండేవి.

చేరడానికి అనాసక్తి

ఉమ్మడి జిల్లాలో 5,45,045 మంది సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. రెండేళ్లుగా కొత్త సంఘాల ఏర్పాటు చేస్తున్నా.. బ్యాంక్‌ లింకేజీ, స్త్రీనిధి రుణాలు ఇస్తున్నా సంఘాల్లో చేరేందుకు మహిళలు ఆసక్తి చూపడం లేదు. ఏడాది క్రితం సభ్యులుగా చేరిన వారు తప్పుకొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 40 వేలకు పైగా సంఘాలు ఏర్పాటు కాగా వీటిలో సగం మనుగడలో లేవని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని