logo

ఎన్నికల వేళ నగదు కష్టాలు

ఎన్నికల కోడ్‌ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు.

Published : 27 Apr 2024 05:39 IST

కోడ్‌తో వివిధ అవసరాలకు సామాన్యుల ఇబ్బందులు
ఈనాడు, కరీంనగర్‌

న్నికల కోడ్‌ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లాలన్నా, అక్కడి నుంచి నగదు తీసుకురావాలన్నా బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు నెల రోజుల కిందట ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడపాదడపా పట్టుబడుతున్న మొత్తమంతా ఎన్నికలకు సంబంధం లేనిదని సంబంధిత అధికారులకు తెలిసినా నిబంధనల అమలులో భాగంగా పట్టుకోక తప్పడం లేదు. దీంతో వ్యాపార, ఇతర అవసరాలకు నగదును తీసుకెళ్లే వారికి కష్టాలు తప్పడం లేదు.

అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందా!

చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నా ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు సంబంధించిన నగదు పెద్దమొత్తంలో పట్టుకున్న దాఖలాలు లేవు. గతేడాది నవంబరులో పట్టుబడినవి కూడా చిరు వ్యాపారులు, సామాన్యులకు సంబంధించిన నగదు కావడం గమనార్హం. మరోవైపు పార్టీలు, అభ్యర్థుల కదలికలపై దృష్టి సారించాల్సిన పోలీసులు, ఎన్నికల యంత్రాంగం కేవలం రహదారులపై నామమాత్రపు చెక్‌పోస్టులతో చేతులు దులుపుకొంటున్నారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్న క్రమంలో కొంత నగదు దొరుకుతుంది. ఇలా ఏ మాత్రం చిన్న మొత్తం దొరికినా పట్టుబడిన నగదులోనే జమ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీల అభ్యర్థులు మాత్రం రూ.లక్షల్లో నగదును పోలీసులు, నిఘా వ్యవస్థ కళ్లు గప్పి తరలిస్తున్నట్లు సమాచారం. ఓటర్లకు నగదు పంపిణీ సహా మద్యం తదితర ప్రలోభాలతో ఓట్లు పొందే ఏర్పాట్లలో నాయకులు బిజీగా ఉన్నారు.

  • ఈ నెల 22న జమ్మికుంటలో వ్యాపారులకు సంబంధించిన రూ.15 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. పత్తి వ్యాపారి బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అవి రైతులకు చెల్లించాల్సిన మొత్తమని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. దీంతో మరుసటి రోజు పత్తి వ్యాపారులంతా రోడ్డెక్కారు. రాజకీయాలతో సంబంధం లేని తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నాయకులకు చెందిన నగదు పట్టుబడటం లేదని, సామాన్యులు, వ్యాపారుల డబ్బులు మాత్రమే పట్టుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • గతేడాది నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో కరీంనగర్‌లోని ఓ వస్త్ర దుకాణానికి చెందిన చెందిన నగదును సమీపంలోని బ్యాంకులో వేసేందుకు వెళ్తున్న దుకాణ సిబ్బందిని పోలీసులు పట్టుకున్నారు. సంబంధిత పత్రాలు చూపించినా ఏదైనా ఉంటే ఎన్నికల అధికారులకు చెప్పాలంటూ డబ్బు సీజ్‌ చేశారు. దాదాపుగా రూ.3 కోట్ల వరకున్న ఈ మొత్తాన్ని కోడ్‌ ముగిసే వరకు వ్యాపారులు తిరిగి పొందలేకపోయారు. కేసు నమోదు, నగదు కోసం తిరగాల్సి రావడం వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. అలాగే నగరంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై రూ.2 లక్షలు తీసుకెళ్తున్న వారికి కూడా ఇలాంటి అవస్థలే ఎదురయ్యాయి.

దొరికిన డబ్బును ఏం చేస్తారంటే..

న్నికల వేళ రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు పట్టుబడిన నగదును జిల్లా ట్రెజరీలో జమ చేస్తారు. రూ.10 లక్షలకు మించి దొరికితే ఆదాయ పన్ను శాఖ నోడల్‌ అధికారికి తెలియజేస్తారు. పట్టుబడిన నగదును వారికి అప్పగిస్తారు. అక్కడి నుంచి నగదు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. సరైన ఆధారాలు చూపి తిరిగి పొందవచ్చు. తక్కువ మొత్తంలో పట్టుబడిన డబ్బును జిల్లా స్థాయి ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఆధారాలు పరిశీలించి తిరిగి అప్పగిస్తారు. జిల్లా స్థాయి కమిటీ సభ్యులు నిజంగానే అది వారిదేనని భావిస్తే పక్కా ఆధారాలు పరిశీలించి ఇచ్చేస్తారు.


నిర్లక్ష్యం వద్దు

  • రోజువారీగా తీసుకెళ్లే మొత్తమే అయినా, సంబంధిత ఆధారాలను వెంట ఉంచుకోవాలి.
  • ఏ అవసరం నిమిత్తం నగదును తీసుకెళ్తున్నామనే విషయం సూటిగా చెప్పడంతో పాటు తగిన పత్రాలను తప్పక చూపాలి.
  • ఏ మాత్రం భయపడినా, సరైన సమాధానం చెప్పకున్నా పోలీసులకు అనుమానం వస్తుందని గుర్తుంచుకోండి.
  • ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి బిల్లు చెల్లించడానికి డబ్బు తీసుకెళ్తుంటే రోగి, చికిత్సకు సంబంధించిన వివరాలు, ఆస్పత్రి బిల్లు, రసీదులు వెంట ఉంచుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని