logo

ఇంటి నంబర్ల గోల్‌మాల్‌!

కరీంనగర్‌ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి.

Published : 27 Apr 2024 05:33 IST

ఖాళీ స్థలాలకు కేటాయింపులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

రీంనగర్‌ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత శాఖల నుంచి వివరాలను సేకరిస్తుండటంతో అధికారులు, ఉద్యోగులు సైతం వణుకుతున్నారు. ఇప్పటివరకు కొందరు కార్పొరేటర్లు, వారి భర్తలు, నాయకులు అరెస్టై జైలుకు వెళ్తుండగా.. తాజాగా నగర పాలక సంస్థ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ), ఒప్పంద ప్రాతిపదికన పని చేసే బిల్‌ కలెక్టర్‌ను కటకటాల్లోకి పంపించడం, బల్దియా చరిత్రలో మొదటిసారి ఇలాంటి సంఘటనలో ఉద్యోగులు ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.

అక్రమార్కులకు స్వీయ మదింపు..

ఇంటి నంబర్ల కేటాయింపులు సులువుగా ఉండేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ స్వీయ మదింపు ద్వారా వీటిని తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. మూడేళ్ల కిందట ఇష్టానుసారంగా ఇంటి నంబర్లు వేసుకున్నారు. ఆ సమయంలో తనిఖీలు లేకపోవడం, దర్జాగా వాటి ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్‌ కూడా జరుగుతున్నట్లు తేలడంతో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. అప్పటికే ఇచ్చిన వాటి వివరాలు సేకరించకపోవడం, ఖాళీ స్థలాలకు, ప్రైవేటు, ప్రభుత్వ భూములకు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. బాధితులు జిల్లా స్థాయిలో ఫిర్యాదులు చేసినా అప్పట్లో చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారడంతో భూకబ్జాలపై, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల కేటాయింపులు వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. మూడు నెలల కిందట ఇదే తరహాలో ఒకే వ్యక్తిపై 14 ఇంటి నంబర్లు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీసింది. ఇదే అంశంపై పోలీసు అధికారులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో గోల్‌మాల్‌ అంతా బయట పడి అరెస్టు వరకు దారి తీసింది.

పలు విభాగాల నుంచి దస్త్రాల సేకరణ

భూఆక్రమణలపై పోలీసు అధికారులు, ఇంజినీరింగ్‌ పనులు, భవన అనుమతులపై విజిలెన్స్‌ అధికారులు, కోర్టు కేసులు వంటి విషయాలపై పోలీసు, విజిలెన్స్‌, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వేర్వేరుగా దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కొన్నాళ్లుగా పలు శాఖల అధికారులు దస్త్రాలు, సంబంధిత సమాచారం ఇచ్చే వరకు కదలడం లేదు. వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుండటంతో ఏ అంశంపై ఎవరు బాధ్యులవుతారో తెలియక ఒత్తిడికి గురవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు