logo

వేసవి వేళ.. ఆటల వేడుక

వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు.

Published : 27 Apr 2024 05:42 IST

మే 1 నుంచి 31 వరకు శిక్షణ శిబిరాలు
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణ
న్యూస్‌టుడే, కరీంనగర్‌ క్రీడా విభాగం

వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. వేసవి సెలవుల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో గడపాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కొందరు చిన్నారులు చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతున్నారు. వారి దృష్టిని మళ్లించి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. వీటిని మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్లలోపు పిల్లలకు నిర్వహిస్తోంది. జిల్లాలో శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి తెలిపారు. నిర్వాహకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈనెల 20న ప్రకటన విడుదల చేశారు.

రూ.55 వేల నిధులు

జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో పది క్రీడా శిబిరాలు నిర్వహించనున్నారు. నెల రోజులు శిక్షణ ఇచ్చే కోచ్‌లకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తారు. ఇలా 10 శిబిరాలకు రూ.40 వేలు చెల్లిస్తారు. మైదానాల అభివృద్ధి, శిబిరాల నిర్వహణకు రూ.10 వేలు, క్రీడల సమయంలో ఆటగాళ్లకు గాయాలైతే ప్రథమ చికిత్స అందించేందుకు రూ.5 వేల చొప్పున మొత్తం కరీంనగర్‌ జిల్లాకు రూ.55 వేలు కేటాయించారు. క్రీడా సామగ్రిని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ సరఫరా చేయనుంది. అథ్లెటిక్స్‌, యోగా, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, సాఫ్ట్‌బాల్‌, టెన్నికాయిట్‌, హ్యాండ్‌బాల్‌, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, చదరంగం, సైక్లింగ్‌ ఇలా అందుబాటులో ఉన్న శిక్షకులను బట్టి శిబిరాలను ఏర్పాటు చేసుకునే అవకాశముంది. ఎక్కడ నిర్వహిస్తారో ఇంకా నిర్ణయించలేదు.

కోచ్‌ల ఎంపిక ప్రక్రియ..

శిక్షణ శిబిరాల నిర్వహణలో శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులు, అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారుల పాత్ర ముఖ్యం.. వారిని ఎంపిక చేసేందుకు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి ఇప్పటికే ఈనెల 26 వరకు దరఖాస్తులు ఆహ్వానించింది. మే 1 నుంచి శిబిరాలు ప్రారంభించాల్సి ఉండటంతో దరఖాస్తులు స్వీకరించి అర్హతలను పరిశీలించి శిక్షకులను నియమించేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేలా దృష్టి సారించారు. అయితే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శిబిరాల్లో చిన్నారుల ఆరోగ్య రక్షణకు అన్ని వసతులు ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


సద్వినియోగం చేసుకోవాలి

- బి.శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి

మే 1 నుంచి జిల్లాలో జరిగే శిబిరాల్లో పిల్లలు క్రీడలో శిక్షణ తీసుకోవచ్చు. నిర్వాహకులు, కోచ్‌ల ఎంపికకు ఈనెల 26 వరకు దరఖాస్తులను స్వీకరించాం. జిల్లాలో వివిధ క్రీడలకు సంబంధించి 10 శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటగాళ్లను వెలికి తీసేందుకు వేసవి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని