logo

ప్రాణం తీసిన ఈత సరదా

ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది.

Published : 27 Apr 2024 05:29 IST

తండ్రి కళ్లెదుటే బావిలో మునిగి బాలుడి మృతి

బోయినపల్లి,  న్యూస్‌టుడే: ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చేపూరి గంగయ్య, తిరుమల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మణితేజ (11) ఏడో తరగతి, చిన్న కుమారుడు రిత్విక్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. గంగయ్య వ్యవసాయ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో తన తోటి బాలురు ఈత నేర్చుకుంటున్నారని, తాను నేర్చుకుంటానని తండ్రిని అడిగాడు. తండ్రి కాదనలేక తనే దగ్గరుండి మూడు రోజులుగా గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో నేర్పిస్తున్నాడు. మణితేజ ఈత బాగా  కొడుతుండటంతో శుక్రవారం బావిలో దిగిన అనంతరం గంగయ్య ఓవైపు ఉండగా, మరోవైపు నుంచి మణితేజ ఈత కొడుతున్నాడు. రెండు సార్లు తండ్రి దగ్గరికి వచ్చి వెళ్లిన కుమారుడు మూడోసారి వస్తున్న క్రమంలో మధ్యలోకి రాగానే అకస్మాత్తుగా మునిగిపోయాడు. వెంటనే గంగయ్య, అక్కడే ఈత కొడుతున్న మరికొంత మంది నీటిలో వెతికినప్పటికీ బావి లోతు ఎక్కువగా ఉండటం వల్ల కనిపించలేదు. గజ ఈతగాళ్లు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లి తిరుమల, కుటుంబ సభ్యులు, స్థానికులు వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లు బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. మణితేజ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడి మృతదేహంపై పడి తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఎస్సై పృథ్వీధర్‌ గౌడ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని