logo

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్‌లో జాబితా సిద్ధమవుతోంది.

Updated : 27 Apr 2024 07:02 IST

పీడీచట్టం అమలుకు కసరత్తు
న్యూస్‌టుడే, గోదావరిఖని

క్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్‌లో జాబితా సిద్ధమవుతోంది. అక్రమ దందాలతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు నేరాల చిట్టా ఆధారంగా పీడీ చట్టం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ అంశంపై పోలీసు కమిషనర్‌ శ్రీనివాస్‌ ప్రత్యేక దృష్టి సారించారు. కమిషరేట్‌ పరిధిలో ఉన్న నేరస్థులు.. వారి ప్రవర్తన.. కదలికలపై నిఘా పెట్టారు. నెల రోజుల వ్యవధిలో కమిషనరేట్‌ పరిధిలో నమోదైన కేసులు, గంజాయితో పాటు రేషన్‌ బియ్యం దందా.. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు వీటిలో ఎంతమంది పాత నేరస్థులున్నారన్న వివరాలు సేకరిస్తున్నారు.

సిద్ధమవుతున్న జాబితా...

రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలో   చాలా కాలంగా పీడీ చట్టం అమలు చేయలేదు. దీనిని ఆసరాగా తీసుకొని చాలా మంది నేరస్థులు వారి దందాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. భూదందాలు చేస్తూ అమాయకులను బెదిరింపులకు గురిచేస్తున్న కొంత మంది రౌడీషీటర్లపై పీడీ చట్టం అమలు చేసేందుకు జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాటుసారా, మద్యం అక్రమ రవాణాకు పాల్పడే వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించేందుకు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తుగానే పీడీ చట్టం అమలు చేయడం ద్వారా ఓటింగ్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. కమిషనరేట్‌ పరిధిలో నెల రోజుల వ్యవధిలో 13.228 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని 16 కేసులు నమోదు చేసి 42 మందిని అరెస్టు చేశారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో 969.05 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 70 మందిపై కేసులు నమోదు చేశారు. సుమారు రూ.17,94,090 విలువ చేసే రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. నాటుసారా తయారు చేస్తున్న 105 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 513 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. రూ.8,34,649 విలువ చేసే 1449 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని 181 మందిపై కేసు నమోదు చేశారు. 87 మందిపై ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు చేయడంతో పాటు 50 ట్రాక్టర్లు, ఒక డీసీఎం వ్యాన్‌, మూడు జేసీబీలు స్వాధీనం చేసుకున్నారు. డీజిల్‌ అక్రమ దందా నిర్వహించే ఏడుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు 5325 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాల దందా, కోడిపందేలు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేశారు. పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 184 మందిపై కేసులు నమోదు చేసి రూ. 22,15,260 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్స్‌, వడ్డీ వ్యాపారం చేసే వారిపై దృష్టి సారించారు.


దందాలకు పాల్పడితే కఠిన చర్యలు

-ఎం.శ్రీనివాస్‌, పోలీసు కమిషనర్‌, రామగుండం

అక్రమ దందాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై నిఘా ఏర్పాటు చేశాం. కమిషనరేట్‌ పరిధిలో ఎవరైనా అక్రమ దందాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు. నిత్యం అదే పనిగా దందాలు సాగిస్తే పీడీ చట్టం అమలు చేస్తాం. కమిషనరేట్‌ పరిధిలో కొంత మందిని గుర్తించాం. వారిపై త్వరలోనే పీడీ చట్టం అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తాం. పాత నేరస్థులు తమ విధానాలు మార్చుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని